నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహాం
Mekapati Gautam Reddy's Body To Be Shifted To Nellore.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం
By తోట వంశీ కుమార్ Published on 22 Feb 2022 10:21 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం నుంచి ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రజలు తేరుకోలేదు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం 11గంటల ప్రాంతంలో నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసం నుంచి మంత్రి మేకపాటి భౌతిక దేహాన్ని బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరు జిల్లా తరలించనున్నారు. మంత్రి పార్థివదేహాం వెంట ప్రభుత్వం ఏర్పాటు చేసిన చాపర్‌లో తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి కూడా వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం 11.15 గం.లకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ గ్రౌండ్ కి చాపర్ చేరుకోనుంది. 11.25గం.లకు డైకాస్ రోడ్డులోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి మంత్రి మేకపాటి పార్థివదేహం చేరనుంది.
11.30 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు ప్రజల సందర్శనార్థం మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్థివదేహాన్ని ఉంచనున్నారు. ఇప్పటికే మంత్రి కుమారుడు యూఎస్ నుంచి బయలుదేరాడు. ఈ రోజు రాత్రి 11గంటలకు నెల్లూరుకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి మేకపాటి భౌతిక దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.