అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఐదుగురు కార్మికులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. భారీ పేలుడు, మంటలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పలువురు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా బాధితులంతా సామర్లకోట వాసులుగా పోలీసులు గుర్తించారు. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.