మార్గదర్శి చిట్ ఫండ్ కుంభకోణం: ఘోస్ట్ గ్రూపులు ఉన్నాయట

మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘోస్ట్ చిట్ గ్రూపులను నిర్వహిస్తోందని.. దాని సభ్యులకు చిట్ మొత్తాలను చెల్లించడం లేదని దర్యాప్తులో వెల్లడైంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2023 11:23 AM IST
Margadarshi, Chit Fund Scam, MCFPL, Ramoji Rao, ghost chit groups

మార్గదర్శి చిట్ ఫండ్ కుంభకోణం: ఘోస్ట్ గ్రూపులు ఉన్నాయట 

మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘోస్ట్ చిట్ గ్రూపులను నిర్వహిస్తోందని.. దాని సభ్యులకు చిట్ మొత్తాలను చెల్లించడం లేదని దర్యాప్తులో వెల్లడైంది. ఎంతో మంది ప్రజలు వాళ్లకు తెలియకుండానే ఈ గ్రూపుల్లో ఉన్నారని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు స్పష్టం చేశారు. సాధారణ ప్రజల లాగే నటించి ఆ వ్యక్తులకు తెలియకుండా అనేక చిట్ సభ్యత్వాలు నిర్వహించారు. కొన్ని సందర్భాల్లో బ్రాంచ్ మేనేజర్‌లు మోసపూరితంగా చందాదారుల డబ్బును స్వాహా చేశారని తేలింది.

గత మూడు రోజులలో, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ బృందాలు మార్గదర్శి చిట్ ఫండ్‌ల చందాదారుల నుండి వచ్చిన కొన్ని ఫిర్యాదులకు సంబంధించి వెరిఫికేషన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని మార్గదర్శి చిట్ ఫండ్‌ కు సంబంధించిన మొత్తం 37 శాఖలను సందర్శించాయి. చిట్‌ మొత్తం చెల్లించకపోవడం, ష్యూరిటీల కోసం పట్టుబట్టడం, బ్రాంచ్‌ మేనేజర్లు డబ్బులు స్వాహా చేయడం వంటి అక్రమాలు కూడా వెలుగు చూశాయి.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) అదనపు డిజిపి ఎన్. సంజయ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వి.రామకృష్ణ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్గదర్శి చిట్ ఫండ్ ఆర్థిక సంక్షోభం అంచున ఉందని స్పష్టం చేశారు. "చిట్ మనీ చెల్లించకపోవడం, ష్యూరిటీల కోసం మితిమీరిన వేధింపుల ఫిర్యాదులతో పెద్ద సంఖ్యలో చందాదారులు వస్తున్నారు, దీనివల్ల వివిధ పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ఎస్‌ను బుక్ చేయాల్సి ఉంది" అని ఎన్ సంజయ్ చెప్పారు. ఇప్పటి వరకు అనకాపల్లి టౌన్, చీరాల I టౌన్, రాజమండ్రి II టౌన్ పోలీస్ స్టేషన్లలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

మార్గదర్శిలో ఆర్థిక సంక్షోభం:

CID ప్రకారం, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. చందాదారులకు చెల్లింపులు చేయడానికి కొత్త చందాదారుల మీద ఆధారపడి ఉంది. "మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో అగ్రి గోల్డ్‌గా మారడంలో ఆశ్చర్యం లేదు" అని ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఎన్ సంజయ్ అన్నారు.

మార్గదర్శి చిట్ ఫండ్‌ల నుండి ఇంకా చెల్లింపులు అందుకోవాల్సిన 50,000 మంది చందాదారులు ఉన్నారు. ఇప్పటి వరకు.. రాష్ట్రవ్యాప్తంగా 37 శాఖల నుండి 1000 మందికి పైగా బహుమతి పొందిన చందాదారులు ఉన్నారు. ఈ వెయ్యి మంది చందాదారుల వేలం మొత్తం ఒక నెల కంటే ఎక్కువ ఆలస్యం అయింది. సరిపడా ష్యూరిటీల పేరుతో మార్గదారి యాజమాన్యం చెల్లింపుల్లో జాప్యం చేస్తోంది. అయితే చందాదారులకు చెల్లింపులు చేయడానికి మార్గదర్శి వద్ద నిధులు లేవు. "నవంబర్ 2022 నుండి మార్గదర్శి మోసాలను వెలికితీసిన తర్వాత ఈ పరిస్థితి ఉంది, చందాదారులు, ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతోంది. కొత్త సభ్యత్వాలు తగ్గాయి" అని సంజయ్ చెప్పారు.

మెయిన్ బ్రాంచ్ లకు డబ్బు మల్లింపు:

చందాదారులు చెల్లించిన సొమ్మును వివిధ స్థాయిల్లో ఏదో ఒక విధంగా దుర్వినియోగం చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన శాఖకు, మార్గదర్శి, ఈనాడు యాజమాన్యం నిర్వహిస్తున్న ఇతర ఆర్థిక సంస్థలకు చాలాసార్లు ఈ డబ్బును మళ్లించినట్లు విచారణలో తేలింది. "మార్గదర్శి తన చందాదారులకు చెల్లింపులు చేయడం జరుగుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. చందాదారులు భయాందోళనలలో ఉన్నారు. మార్గదర్శికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌లను ఆశ్రయిస్తున్నారు" అని సంజయ్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో చందాదారుల పలు ఫిర్యాదులను ఏపీ సీఐడీ పరిగణనలోకి తీసుకుని విచారిస్తోంది. చందాదారుల సౌకర్యార్థం అధికారులు వాట్సాప్ నంబర్ 9493174065ను రూపొందించారు.

ఘోస్ట్ చందాదారులు

ఘోస్ట్ సబ్‌స్క్రైబర్‌లు అంటే చిట్ ఫండ్ సాధారణ పౌరుల వలె నటిస్తూ ఉంటారు. అసలు వ్యక్తుల కు ఈ విషయం తెలియకుండా చిట్ మెంబర్‌షిప్ నడుపుతున్నట్లు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో, బ్రాంచ్ మేనేజర్‌లు చందాదారుల డబ్బును మోసపూరితంగా స్వాహా చేశారు. వ్యక్తులకు తెలియకుండానే వారి ఆధార్‌ నంబర్లు సేకరించి, చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చూపిస్తున్నారు. ఆ విధంగా ఘోస్ట్‌ చందాదారుల పేరిట డివిడెండ్లతో పాటు చిట్టీ మొత్తాన్ని మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ తమ ఖాతాల్లో జమ చేసుకుంటూ మోసానికి పాల్పడుతోంది. ఇది చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధం. ఇలా చేసి ఇతర చందాదారుల ఆర్థిక ప్రయోజనాలకు తక్కువ డివిడెండ్‌ వచ్చేలా చేస్తున్నారు. ఘోస్ట్‌ చందాదారునికి ఎక్కువ వేలంపాట మొత్తం వచ్చేట్టుగా వేలం నిర్వహిస్తున్నారు.

ప్రతి సమూహంలో మార్గదర్శి చిట్ సభ్యులుగా ఉన్న కొన్ని ఖాళీ షీట్లు ఉంచుతారు. ఖాళీగా ఉన్న చిట్‌లను సాధారణ చందాదారులు భర్తీ చేయకపోతే, కంపెనీ ప్రతి నెల వాయిదాలను చెల్లిస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి, కంపెనీ, బ్రాంచ్ మేనేజర్లు ఘోస్ట్ చందాదారులుగా కొంతమంది వ్యక్తులను వారికి తెలియకుండా చందాదారులుగా నమోదు చేస్తున్నారు. అటువంటి సబ్‌స్క్రైబర్ మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ను సబ్‌స్క్రైబర్ చెల్లించినట్లుగా కంపెనీ చెల్లిస్తుంది. ఇతర చెల్లింపులు డిఫాల్ట్ చేస్తారు. ఒక ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రమే చెల్లించి డిఫాల్టర్‌గా మారిన సబ్‌స్క్రైబర్ తో మోసానికి పాల్పడుతూ ఉంటారు.

బ్లాక్ మనీ:

పన్ను ఎగవేతలకు మార్గదర్శి స్వర్గధామమని సీఐడీ గుర్తించింది. ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాల నల్లధనం ఉన్నవారికి ఇది మరో స్విస్ బ్యాంక్ లాంటిది. మేనేజ్‌మెంట్‌కు తెలిసి బినామీల పేరుతో మార్గదర్శిలో చాలాసార్లు నల్లధనం పెట్టుబడి పెడుతున్నారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కమ్ ట్యాక్స్ తదితర శాఖలు మరింత విచారణ జరపాల్సి ఉందని అధికారులు తెలిపారు. చందాదారుల ఆర్థిక అంశాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండగా, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్గదర్శి మోసాలను తెలియజేయడాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మార్గదర్శి చిట్ ఫండ్ పనితీరులో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్, ఇతరులపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సిఐడి గతంలో ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.

Next Story