వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గ శాసనసభ పదవి ఖాళీ అయ్యింది. రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వైసీపీలో సంచలనం రేపింది. ఆళ్ల అసంతృప్తితో రాజీనామా చేసినట్లు తెలిసింది. 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నాయకుడు నారాలోకేష్‌పై విజయం సాధించారు. కొద్ది రోజుల నుండి పార్టీ అధినాయకత్వం పట్ల ఆళ్ల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
రాజీనామా లేఖను ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపినట్లు తెలిసింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆళ్ల.. మంగళగిరి నియోజకవర్గంలో తనపై అసంతృప్తి పెరగడం, చాలా పనులు పెండింగ్‌లో ఉండటం, అవి పూర్తి కాకపోవడంతో రాజీనామా చేసినట్లు సమాచారం. తనకు మంత్రి పదవి కూడా దక్కలేదన్న అసహనంతో ఆళ్ల ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే టికెట్‌ను అధిష్ఠానం బీసీలకు ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన అధిష్ఠానంపై అలక వహించినట్టు తెలుస్తోంది.