చనిపోయాడనుకున్న వ్యక్తి ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పఠాన్ సైదుమియా మద్యానికి బానిసై ఆర్మీ ఉద్యోగం వదిలేసి లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య రహమత్బీ, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలు తరచూ గొడవపడి విడిపోయారు. అప్పటి నుంచి రహమత్బీ తన కుమార్తెతో కలిసి అనుమలవీడులోని తల్లి ఇంట్లో ఉంటోంది. అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తున్న సైదుమియా లారీ క్లీనర్ పనికి వెళ్లి 2, 3 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు.
ఈ క్రమంలో 41 రోజుల క్రితం మార్కాపురం రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి మృతి చెందినట్లు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బంధువులు సైదులుగా భావించి మృతదేహాన్ని ముండ్లపాడుకు తీసుకొచ్చారు. అతని భార్య రహమత్బీని పిలిపించి అంత్యక్రియలు పూర్తి చేశారు. బుధవారం సైదుమియా ఇంటికి రావడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. 3 నెలలుగా లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నానని, ప్రస్తుతం గ్రామంలో జరిగే పీర్ల చావిడిలో పాల్గొనేందుకు వచ్చానని సైదుమియా తెలిపాడు. ఇన్నిరోజులూ తెలంగాణలోని ఆర్మూరులో ఉన్నట్లు సైదుమియా తెలిపాడు. గతంలో కూడా చనిపోయాడనుకున్న వ్యక్తి ఇంటికి తిరిగి రావడంలాంటి ఘటనలు.. చాలా చోట్ల జరిగాయి.