మిస్టరీగా కాల్వలో మునిగిన కారు ఘటన.. యజమాని ఏమయ్యాడు?
కృష్ణా జిల్లాలో కారు కాల్వలో మునిగింది. అయితే.. అందులో ఉన్న యజమాని మాత్రం అదృశ్యం అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 18 July 2023 10:32 AM ISTమిస్టరీగా కాల్వలో మునిగిన కారు ఘటన.. యజమాని ఏమయ్యాడు?
కృష్ణా జిల్లాలో కారు కాల్వలో మునిగింది. అయితే.. అందులో ఉన్న యజమాని మాత్రం అదృశ్యం అయ్యాడు. కారులోనే అతని దుస్తులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దాంతో.. ఈ ఘటన మిస్టరీగా మారింది. కారు కాల్వలో మునిగితే.. యజమాని ఏమయ్యాడు? అనే సందిగ్ధత నెలకొంది. యజమాని ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక దగ్గర జరిగింది ఈ ఘటన. గాజుల రత్నభాస్కర్ (43) అనే వ్యక్తి అవనిగడ్డ నివాసి. బంటుమిల్లి సమీపంలోని రామవరపుమూడిలో ఐస్ కోల్డ్ స్టోరేజ్ నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. మచిలీపట్నంలో జరుగుతున్న ఒక రాజకీయ పార్టీ సమావేశాని వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఆదివారం బయల్దేరాడు. సోమవారం వేకువజామున పెదపులిపాక వంతెన దగ్గర రత్నభాస్కర్ కారు కరవు కాల్వలో పైకప్పు వరకు మునిగిపోయి కనిపించింది. అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. కారు లైట్లు నీటిలో మునిగినా వెలుగుతూనే ఉన్నాయి. అటు వైపుగా వెళ్తున్న ఒక లారీ డ్రైవర్ దాన్ని గమనించాడు. వెంటనే లారీ ఆపి కిందకు దిగి చూశాడు. కారు నీటిలో మునిగిపోయి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
దాంతో.. పోలీసులు కూడా వెంటనే సంఘటనాస్థలానికి వెళ్లారు. కారుని పరిశీలించారు. అప్పటికే కారు డోర్లు తెరిచి ఉన్నాయి, జత దుస్తులు డ్రైవర్ సీటు కింద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డాష్‌బోర్డులోని పత్రాలను పరిశీలించి కారు రత్న భాస్కర్‌దిగా గుర్తించారు. తర్వాత అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మచిలీపట్నంలో సమావేశానికి హాజరైన ఇతను.. పెదపులిపాక ప్రాంతానికి ఎందుకు వచ్చాడు..? ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక వ్యూహంతో చేశారా..? కారులో రత్నభాస్కర్ ఒకరే ఉన్నారా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు రత్నభాస్కర్ ఏమయ్యాడు..? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా రత్నభాస్కర్ సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. శనివారం రాత్రి వరకు మచిలీపట్నంలోనే ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు తెలిపారు. రత్నభాస్కర్ కాల్వలో గల్లంతు అయ్యారా? లేక కారు దిగి వెళ్లిపోయారా? అనేది మిస్టరీగా మారింది. రత్న భాస్కర్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.