ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దాపురంలో ఇటీవల విడుదలైన హాలీవుడ్ మూవీ 'అవతార్ 2' చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. లక్ష్మీరెడ్డి శ్రీను అనే బాధితుడు ఇటీవల విడుదలైన అవతార్ 2 సినిమా చూసేందుకు తన సోదరుడు రాజుతో కలిసి పెద్దాపురంలోని ఓ సినిమా థియేటర్‌కి వెళ్లాడు. సినిమా మధ్యలో శ్రీను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తమ్ముడు రాజు వెంటనే పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
మరోవైపు అవతార్ సినిమా తరువాత భారీ అంచనాలు క్రియేట్ చేసిన అవతార్ 2 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజే రికార్డులను క్రియేట్ చేసింది అవతార్ 2. జేమ్స్ కామెరూన్ అవతార్ 2తో మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు జేమ్స్ కామెరూన్. యాదృచ్ఛికంగా.. తైవాన్‌లో 42 ఏళ్ల వ్యక్తి 2010లో విడుదలైన 'అవతార్' సినిమా మొదటి భాగాన్ని చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ 2010లో తెలిపింది. ఆ వ్యక్తికి అధిక రక్తపోటు చరిత్ర ఉంది. అతనిని చెక్ చేసిన వైద్యుడి ప్రకారం.. ''సినిమా చూడటం వల్ల కలిగే అధిక ఉత్సాహం'' అతనిలో అధిక రక్తపోటును ప్రేరేపించింది.