చిత్తూరు జిల్లాలో ఏనుగులు మళ్లీ బీభత్సం సృష్టించాయి. కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. ఓఎన్ కొత్తూరు పంచాయతీ శ్రీనివాసపురం సమీపంలో ముగ్గురు వ్యక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల గుంపు దాడిలో ఒకరు చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి తమిళనాడు అడవుల్లో నుంచి ఏపీ పరిధి గుడిపల్లె మండలం చిగురుగుంట అటవీ ప్రాంతానికి చేరుకున్న ఏనుగులు ముగ్గురిపై దాడి చేశాయి.
తమిళనాడుకు చెందిన గోవిందు మృతిచెందాడు. గాయపడిన వ్యక్తులను స్థానికులు 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. గుడిపల్లె మండలం శ్రీనివాసపురానికి చెందిన నాగరాజు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏనుగుల దాడుల పట్ల జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.