టీడీపీలో చేరిన మహాసేన రాజేశ్

Mahasena Rajesh Joined In TDP. టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో దళిత నేత మహాసేన రాజేశ్

By Medi Samrat  Published on  17 Feb 2023 3:45 PM IST
టీడీపీలో చేరిన మహాసేన రాజేశ్

టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో దళిత నేత మహాసేన రాజేశ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సామర్లకోటలో చంద్రబాబు దళిత సామాజికవర్గంతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మహాసేన రాజేశ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజేశ్ కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మహాసేన రాజేశ్ ఒకప్పుడు వైసీపీలో పని చేశారు. ఆ తర్వాత జనసేనకు మద్దతు ఇస్తూ పలు వీడియోలు చేస్తూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన వైపు మహాసేన రాజేశ్ వెళ్తారని అందరూ అనుకోగా.. ఇప్పుడు టీడీపీ కండువా పుచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూ వస్తున్నారు మహాసేన రాజేశ్.

టీడీపీలో చేరిన సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ, చీకటి వచ్చిన తర్వాతే వెలుగు విలువ తెలుస్తుందని, జగన్ అస్తవ్యస్త పాలన చూశాక చంద్రబాబు పాలన ఎంత గొప్పదో అర్ధమవుతోందని అన్నారు. జగన్ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును దళితద్రోహిగా పేర్కొన్నారని, తాము కూడా జగన్ మాటలు నిజమే అని భావించామని, కానీ త్వరలోనే నిజమైన దళిత ద్రోహి ఎవరో గుర్తించామని మహాసేన రాజేశ్ అన్నారు. జగన్ మాటలు నమ్మి చంద్రబాబును అపార్థం చేసుకున్నామని.. ఎస్సీలకు 27 పథకాలు అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని, దళితులు ఆత్మాభిమానంతో బతికేలా చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టారని అన్నారు. తన వాయిస్ కు మరింత బలం టీడీపీలో చేరాక వచ్చిందని మహాసేన రాజేశ్ అన్నారు.


Next Story