ఏపీలో పరువు హత్య కలకలం.. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిని చంపిన తండ్రి.. ఆపై..
పల్నాడు జిల్లా మాచర్లలో గత నెలలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసు విషాదాంతమైంది.
By - అంజి |
పల్నాడు జిల్లా మాచర్లలో గత నెలలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసు విషాదాంతమైంది. కన్నతండ్రే తన కుమార్తె చౌడేశ్వరి (22)ని అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పరువు కోసం తండ్రి చేసిన ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. మాచర్లకు చెందిన వ్యాపారి చంద్రశీను తన కుమార్తెకు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహం నిశ్చయించారు. అయితే, నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు చౌడేశ్వరి తాను ప్రేమించిన నాగరాజు అనే యువకుడితో కలిసి వెళ్లి వివాహం చేసుకుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా, తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని పరువు తీసిందన్న కక్షను చంద్రశీను పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో నగలు పోయాయంటూ కూతురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి, ఐదు రోజులు పుట్టింట్లో ఉండి ఆ తర్వాత భర్త వద్దకు వెళ్లేలా ఒప్పందం కుదిర్చారు.
తీరా భర్త వద్దకు వెళ్లాల్సిన రోజుకు సరిగ్గా ఒక రోజు ముందు, అంటే మార్చి 18న చంద్రశీను తన పథకాన్ని అమలు చేశారు. భార్య, కుమారుడిని పొలానికి పంపించి, తన మేనల్లుడు పచ్చిపాల శీనుతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న కూతురి ముఖంపై దిండు అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అనంతరం అది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరి వేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అది హత్యేనని తేలడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా, పరువు కోసమే చంపేశానని నిందితుడు చంద్రశీను నేరాన్ని అంగీకరించారు. జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.