పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్సైపై దాడి స్థానికంగా కలకలం రేపింది. భామిని మండలంలోని సతివాడ పంచాయతీ కొత్తగూడ సమీపంలో సారా తయారు చేస్తున్నారని పక్కా సమాచారం అందింది. దీంతో ఎస్సై సీతారామ్ తన సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించేందుకు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే గ్రామానికి సమీపంలో కొందరు స్థానికులు ఎస్సై, కానిస్టేబుళ్లపై కర్రలతో దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఎస్సైని కొత్తూరు ఆస్పత్రికి తరలించారు, అక్కడి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సీతారామ్‌ను పార్వతీపురం ఎస్సీ వి. విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ, డీఎస్పీ దిలీప్ కుమార్, సుభాష్ పరామర్శించారు. జరిగిన ఘటనపై ఎస్సీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలు చేయడానికి ఎవరెవరు వెళ్లారు, ఎవరికి గాయాలు అయ్యాయి అనే దానిపై కూడా సంబంధిత అధికారుల నుంచి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలను అందజేయాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని ఎస్సైకి భరోసా ఇచ్చారు.
జరిగిన ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.