ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు విరాళం ఇచ్చారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ.17 లక్షల చెక్కును అధికారులకు అందజేశారు. సోమవారం మధ్యాహ్నం అన్న వితరణకు అయ్యే ఖర్చును లెజినోవా విరాళంగా ఇచ్చారు. కాగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని అన్నా లెజినోవా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు రోజుల చికిత్స అనంతరం.. మార్క్ శంకర్‌ను పవన్ కళ్యాణ్, అన్నాలెజినోవా నిన్న హైదరాబాద్ తీసుకొచ్చారు. అనంతరం ఆదివారం సాయంత్రం అన్నా లెజినోవా తిరుమలకు వెళ్లారు. ఈ తరుణంలో నేడు(సోమవారం) ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని వేకువజామున దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడు కోలుకోవడంతో అన్నా లెజినోవా తిరుమలలో మార్క్ శంకర్ పేరు మీద ఇవాళ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.