11 ఏళ్లుగా భార్యను ఇంటికే పరిమితం చేసిన లాయర్
ఓ న్యాయవాది తన భార్యను 11 ఏళ్లుగా ఇంటికే పరిమితం చేశాడు. కనీసం ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడనీయలేదు
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 2:49 AM GMTLawyer Locked wife home 11 years
విజయనగరం : న్యాయం చేయాల్సిన న్యాయవాదే భార్యను హింసకు గురి చేశారు. అత్తవారింటి ఆంక్షలతో 11 ఏళ్ల పాటు ఆ మహిళ ఇంట్లోని గదికే పరిమితమైంది. బాహ్య ప్రపంచానికి దూరమైంది. తమ కూతురు అసలు బతికి ఉందో లేదోనన్న సందేహంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో ఆ అభాగ్యురాలికి ఎట్టకేలకు విముక్తి లభించింది. చాలా సంవత్సరాల తరువాత కూతురును చూసిన ఆ తల్లి కన్నీటి బాష్పాలు అందరిని కంటతడి పెట్టించాయి.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన న్యాయవాది మధుబాబుకు పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు చెందిన సాయిసుప్రియతో 2008లో వివాహం జరిగింది. 2009లో వీరికి పాప పుట్టింది. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సుప్రియ కూతురు పుట్టాక అత్తవారింటికి వచ్చింది. అప్పటి నుంచి ఆమె కుటంబంతో సంబంధాలు లేకుండా, ఫోన్‌లో కూడా మాట్లాడనీయకుండా ఆమెను అడ్డుకున్నారు.
ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా బంధించారు. సాయిప్రియను చూసేందుకు ఆమె తల్లిదండ్రులు వచ్చినా..కలవనిచ్చేవారు కాదు. ఇలా 11 ఏళ్లు గడిచాయి. కూతురు ఎలా ఉందో తెలియక ఆమె తండ్రి మంచం పట్టారు. అసలు తమ కూతురు బతికి ఉందో లేదోనని కన్నీటిపర్వంతమవుతూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా.. మా ఇంట్లోకి రావడానికి మీకు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించాడు. వెనక్కి తగ్గిన పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
న్యాయమూర్తి ఆదేశాలతో బుధవారం మధ్యాహ్నాం సెర్చ్ వారెంట్‌తో అక్కడికి చేరుకున్నారు. సుప్రియను గృహనిర్భంధం నుంచి విముక్తి కల్పించారు.