అప్పుడు అమరావతిలో.. ఇప్పుడు కర్నూలులో

Land rates may increase in Kurnool.కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం

By సునీల్  Published on  5 Aug 2022 7:33 AM GMT
అప్పుడు అమరావతిలో.. ఇప్పుడు కర్నూలులో

  • కాబోయే న్యాయ రాజధానిలో రియల్ బూమ్!
  • హైకోర్టుపై తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం
  • కర్నూలులో భూముల ధరలకు రెక్కలు

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయనే ప్రచారంతో అక్కడి భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. తాజాగా కేంద్రం హైకోర్టు అంశం రాష్ట్రమే చూసుకోవాలని మరోసారి తేల్చి చెప్పింది. దీంతో కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో లే ఔట్లు వేసేందుకు రియల్టర్లు సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధానిగా ప్రకటించారు. ఈ అంశం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండటంతో కేసుల చిక్కులు లేని కార్యాలయాలను తరలించే పనిలో ప్రభుత్వం పడింది.

టీడీపీ హయాంలో రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో అక్కడి భూముల ధరలు చుక్కలనంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి కర్నూలు పరిసరాల్లో కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. పాలనా రాజధానిని తరలించాలంటే బోలెడు తలనొప్పులున్నాయి. కోర్టు కేసుల చిక్కులతోపాటు ఇతర ఇబ్బందులున్నాయి. అదే న్యాయ రాజధాని విషయంలో అలాంటివేం లేవు. ఇటీవల పార్లమెంటులో కూడా ఈ విషయంపై వచ్చిన ప్రశ్న సందర్భంగా.. 'ప్రభుత్వం- హైకోర్టు' కలిసి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తరలింపు, నిర్వహణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కనుక న్యాయ రాజధానిపై వడివడిగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం హైకోర్టుపై చేసిన ప్రకటన ఉత్సాహాన్నిచ్చింది. ప్రభుత్వం- హైకోర్టు కలిసి కర్నూలు తరలించాలనుకుంటే చాలు.. ఆ తరువాత రాష్ట్రపతి గెజిట్ విడుదలవుతుంది. అతి త్వరలోనే ఈ విషయంపై ఒక స్పష్టత రానుంది.

కేంద్రం ప్రకటన నుంచి రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో హైకోర్టు తరలింపుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు పర్యటనలో హైకోర్టు ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల్లో హైకోర్టు, నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పరిణామాలతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి.

కర్నూలు- నంద్యాల మార్గంలో కర్నూలుకు సమీపంలో జగన్నాథ గట్టు ఉంది. కొండ ప్రాంతమైన జగన్నాథ గట్టు చుట్టుపక్కల భూముల విలువలు హైకోర్టు తరలింపు ప్రచారంతో అమాంతం పెరిగిపోయాయి. మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడే అధికార పార్టీ నేతలు కర్నూలు చుట్టుపక్కల వేల ఎకరాలు తక్కువ ధరలకే కొనుగోలు చేసి ఉంచారు. జగన్నాథ గట్టు వద్దనేనని నిర్ధారణ కావడంతో ఆ సమీప భూముల్లో లే ఔట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. న్యాయ రాజధాని ఏర్పాటు పుణ్యమా అని గతంలో రూ. వేలల్లో పలికిన భూముల ధరలు ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి.

Next Story
Share it