అమరావతి: ప్రభుత్వాసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని అని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇందుకోసం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వ్యాధి నిర్ధారణ, చికిత్స సులభతరం చేయడంలో టెక్నీషియన్లదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. రాజమండ్రి ల్యాబ్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల విజ్ఞాన సదస్సు జరిగింది.
ఈ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. సమాజంలోని ల్యాబ్ టెక్నీషియన్ల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడం ప్రభుత్వ బాధ్యతను ఆయన ఎత్తిచూపారు. MRI స్కాన్‌లు, ఎక్స్‌రేస్, ఇతర పరీక్షల ద్వారా ఖచ్చితమైన రోగ నిర్ధారణ కోసం వైద్యులు, రోగులు ఇద్దరూ ప్రయోగశాల సేవలపై ఎక్కువగా ఆధారపడతారని దుర్గేష్ తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ల కార్యాలయానికి స్థలం కేటాయించి బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.