ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకు అధికారుల మని చెప్పి, ఓటీలు అడిగి, అకౌంట్ అప్‌డేట్ అంటూ వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. సామాన్య ప్రజలే కాదు.. ఓ ఎంపీ సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయారు. అకౌంట్ అప్‌డేట్ అని చెప్పి ఏకంగా రూ.97,699 కాజేశారు.
కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మొబైల్ ఫోన్‌కు బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని, వెంటనే పాన్ నెంబరు జత చేసి అప్‌డేట్ చేసుకోవాలంటూ మొన్న(సోమవారం) ఓ మెసేజ్ వచ్చింది. అప్‌డేట్ చేసుకునేందుకు కింద ఓ లింక్ ను కూడా ఇచ్చారు. దాన్ని నమ్మిన ఎంపీ లింకును ఓపెన్ చేసి అందులో వివరాలను నమోదు చేయగా.. వెంటనే ఆయన సెల్‌ఫోన్‌కు ఓటీపీ నంబర్లు వచ్చాయి. ఆ వెంటనే హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగి తెలుసుకుని ఖాతా అప్‌డేట్ అయిపోతుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
అంతే.. ఆయన ఖాతా నుంచి ఓ సారి రూ. 48,700, మరోసారి రూ. 48,999 డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. ఎంపీకి అనుమానం వచ్చి బ్యాంకుకు ఫోన్ చేయగా.. అసలు విషయం తెలిసింది. తాను సైతం మోసపోయానని గ్రహించి టూ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఎంపీ సంజీవ్ కుమార్. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.