బొణిగి ఆనందయ్య కరోనా మందు గురించి దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే..! కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తుండగా.. నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు. ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు.
ఆనందయ్య రోజుకు మూడు వేల మందికి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తూ ఉండగా.. ఏకంగా 30-50వేల మంది అక్కడికి చేరుకున్నారు. కృష్ణ పట్నంకు వెళ్లే దారులన్నీ రద్దీగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సమీక్ష సమావేశంలోనూ చర్చించారు. దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. ముందుగా ఆ ఔషధం శాస్త్రీయతను నిర్ధారణ చేయించాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. నెల్లూరుకు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన ఐసీఎంఆర్ బృందాన్ని పంపించాలని ఆదేశించారు. ఆయుర్వేద మందు గుణగణాలపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు నిర్దేశించారు.