కాపులను పవన్ రాజకీయాలకు వాడుకుంటున్నారు: కొట్టు సత్యనారాయణ
By Srikanth Gundamalla Published on 15 Jun 2023 2:44 PM ISTకాపులను పవన్ రాజకీయాలకు వాడుకుంటున్నారు: కొట్టు సత్యనారాయణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో కాపులను పవన్ కల్యాణ్ తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. కాపులు ఏకం కాకుండా చంద్రబాబు కుట్ర చేస్తే.. పవన్ కల్యాణ్ ఏకంగా వారిని మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసే ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు వేధించారని.. ఈ విషయం పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ జనాల్లోకి వెళ్లి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారని విమర్శించారు. కాపులు సీఎం జగన్‌ను నమ్మారు కాబట్టే 60 శాతం కాదు.. 90 శాతం ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. అందుకే సీఎం జగన్ కూడా కాపులకు సముచిత స్థానం కల్పించారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కొనియాడారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ల తప్పుడు జీవో కంటే.. సీఎం జగన్ దాని వల్లే వారికి మేలు జరుగుతోందని అన్నారు. ఈ విషయం కూడా పవన్ కల్యాణ్‌కు తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందని చురకలంటించారు. చంద్రబాబు చేసిన అవినీతి పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పవన్‌కు అందాల్సిన ప్యాకేజీలు అందుతున్నాయి కాబట్టే చంద్రబాబు గురించి మాట్లాడటం లేదని.. ఆయనకు చంద్రబాబు గొప్పోడిలా కనిపిస్తున్నారని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.