తండ్రిని చంపిన వారితో షోలా?.. 'అన్‌స్టాపబుల్‌-2' షోపై కొడాలి నాని హాట్‌ కామెంట్స్‌

Kodali Nani's sensational comments on the show 'Unstoppable-2'. మాజీ మంత్రి, గుడివాడకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

By అంజి  Published on  13 Oct 2022 10:09 AM IST
తండ్రిని చంపిన వారితో షోలా?.. అన్‌స్టాపబుల్‌-2 షోపై కొడాలి నాని హాట్‌ కామెంట్స్‌

మాజీ మంత్రి, గుడివాడకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన బావ, టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుతో 'అన్‌స్టాపబుల్ 2' షో చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) మృతికి చంద్రబాబే కారణమని కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ చనిపోయి 25 ఏళ్లు కావస్తున్నా షో పేరుతో బాలకృష్ణ, చంద్రబాబులు ఎన్టీఆర్‌ను అవమానించారని ఎమ్మెల్యే కొడాలి అన్నారు. తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అంటూ ప్రశ్నించారు.

షో పేరుతో కొడుకు, అల్లుడు ఎన్టీఆర్‌ను ఇంకా హింసిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ కాళ్ల దగ్గరే ఉండి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబన్నారు. ఇప్పుడు కళ్లుగప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీని నడిపించే సత్తా చంద్రబాబుకు లేకుంటే పార్టీని వీడి ఉండాల్సిందన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని ఎందుకు లాక్కున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం గురించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని టీడీపీ అధినేతపై నాని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు తెలియవని, ఉత్తర ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో జన వాణి కార్యక్రమాన్ని కొడాలి నాని తప్పుబట్టారు.

నంద‌మూరి న‌ట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన 'అన్‌స్టాప‌బుల్' షో సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ షో గా నిలిచింది. దీంతో సీజ‌న్ 2 కోసం ప్రేక్ష‌కులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. రెండో సీజ‌న్‌కు సంబంధించి అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పింది ఆహా టీమ్‌. ఈ నెల‌(అక్టోబ‌ర్‌) 14 నుంచి 'అన్‌స్టాప‌బుల్ 2' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సెకండ్‌ సీజన్‌లో ఫస్ట్‌ గెస్ట్‌గా రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Next Story