డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. ప్రజా విశ్వాసం చూరగొడనమే లక్ష్యం
Kasireddy Rajendranath Reddy take charge as a AP new DGP.ఏపీ నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం
By తోట వంశీ కుమార్ Published on 19 Feb 2022 6:50 AM GMTఏపీ నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా, హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
ఇక తనను డీజీపీగా ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్‌కు నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడ్కోలు కార్యక్రమంలో నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ, ప్రస్తుత డీజీపీలు ఇద్దరూ బెటాలియన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ప్రజా విశ్వాసం ఎప్పుడూ శిరోధార్యమేనని అన్నారు. ప్రజల విశ్వాసం చూరగొడనమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని తెలిపారు. జిల్లా ఎస్పీలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు పోలీసుంతా బాధ్యతగా ఉండాలన్నారు. ఎక్కడ చిన్న తప్పు చేసినా మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆరోపణలపై ఉన్నత స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు. గౌతమ్ సవాంగ్ పనితీరు తనకు చాలా స్పూర్తినిచ్చిందన్నారు.
అనంతరం గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ వ్యవస్థను చేరువ చేసేందుకు పని చేసినట్లు తెలిపారు. ఈ రోజుతో తన 36 ఏళ్ల పోలీస్ సర్వీస్ ముగుస్తోందన్నారు. రెండేళ్ల 8 నెలలు డీజీపీగా కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ పోలీస్ వ్యవస్థలో డిజిటల్‌గా చాలా మార్పులు తేగలిగాం అని గౌతమ్ సవాంగ్ చెప్పారు.