ఓ మ‌హిళా ఎస్సై మాన‌వ‌త్వం చాటుకున్నారు. అనాథ శ‌వాన్ని మోయ‌డానికి ఎవ‌రూ ముందుకు రానివేళ ఆమె త‌న భుజాల‌పై ఆ శ‌వాన్ని మోసుకు వెళ్లి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది. అందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆమె మ‌హిళా ఎస్సై చేసిన ప‌నికి ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇది శ్రీకాకుళం జిల్లా ప‌లాస కాళీబుగ్గ మున్సిపాలిటీ ప‌రిధిలో జ‌రిగింది.

వివరాల్లోకి వెళితే.. ఒకటో వార్డులో ఉన్న అడవి కొత్తూరు గ్రామం పొలాల్లో ఓ గుర్తుతెలియ‌ని మృత‌దేహాం ఉంద‌న్న‌ స‌మాచారం అందుకున్న కాశిబుగ్గ ఎస్సై కొత్త శిరీష అక్క‌డికి చేరుకుంది. ఆ మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు సాయం చేయాల్సిందిగా అక్క‌డున్న వారిని అడిగింది. అయితే.. వారు ఎవ‌రూ కూడా అందుకు ముందుకు రాలేదు. దీంతో త‌నే ముంద‌డుగు వేసి వేరొక‌రి సాయంతో కిలోమీట‌ర్‌కు పైగా స్వ‌యంగా మోసుకుని వ‌చ్చారు.


కోసంగిపురం కూడలి వద్ద గల లలితా చారిటబుల్ ట్రస్టు వారికి దహన సంస్కారాలకు అప్పజెప్పారు. ఎస్సై శిరీష పొలం గట్లు, అటవీప్రాంతాలు దాటుకుంటూ ఓ స్ట్రెచర్ పై మోసుకురావడం పట్ల సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది. ఏపీ పోలీస్ విభాగం కూడా ఎస్సై శిరీషను అభినందిస్తూ ట్వీట్ చేసింది. ఆమె వీడియోను కూడా పంచుకుంది. కాశీబుగ్గ ఎస్సై శిరీష మానవీయ దృక్పథాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story