గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధత్యలు చేపట్టిన అనంతరం విశాఖపట్టణంలో అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేస్తున్నారన్నారు. విశాఖపట్నంలోని అక్కా చెల్లమ్మలకు ఇళ్ల నిర్మాణం ఫైల్‌పై తొలి సంతకం చేసినట్లు చెప్పారు.
విశాఖలో లక్ష మంది పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. గతంలో ఇంటి నిర్మాణానికి 90 సిమెంట్ బ్యాగులకు ఇస్తే.. ప్రస్తుతం 140 ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారన్నారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు పేద ప్రజలు తమ కష్టాలు తెలియజేశారని, ఆ కష్టాలను తీర్చేందుకే అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పేదలకు సేచురేషన్ పద్దతిలో ఇళ్లు కట్టిస్తున్నట్లు చెప్పారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ అధిక గుర్తింపు ఇచ్చారన్నారు. సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని మంత్రి జోగి రమేష్ అన్నారు.