అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య ఈ మున్సిపాలిటినీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూడు రోజుల కిందట ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్లను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన నాటి నుంచి ఈ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికతో దీనికి తెరపడింది.
ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాడిపత్రిలో రౌడీయిజం, గుండాయిజం ఇక ఉండదన్నారు. సేవ్ తాడిపత్రి తమ నినాదంగా పేర్కొన్నారు. తమ కౌన్సిలర్లు అందరూ బాహుబలిలు, ఝాన్సీ లక్ష్మీబాయిలు అని అన్నారు. అధికారులు అంతా న్యాయబద్ధంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికకు ముందు వేర్వేరు మార్గాల్లో మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి చేరుకున్నారు.
ఇక తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వారుల్లో రెండు వైసీపీకి ఏకగ్రీవం కాగా.. 34 వార్డులకు ఎన్నికలు జరిగాయి. టీడీపీకి 18, వైసీపీ 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు. వైసీపీ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో వైసీపీ బలం 18కి చేరింది. టీడీపీ తరుపున ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో టీడీపీ బలం 19కి చేరుతుందని అంతా బావించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ దీపక్ రెడ్డి ఓటును తిరస్కరించిన విషయం తెలిసిందే.