సినీ నటి మాధవీలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి
సినీనటి మాధవీలతకు జెసి ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. మాధవిలతపై కేవలం ఆ పదం ఉపయోగించినందుకు మాత్రమే క్షమాపణ చెబుతున్నానని జేసీ తెలిపారు.
By అంజి
సినీ నటి మాధవీలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి
సినీనటి మాధవీలతకు జెసి ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. మాధవిలతపై కేవలం ఆ పదం ఉపయోగించినందుకు మాత్రమే క్షమాపణ చెబుతున్నానని జేసీ తెలిపారు. మంత్రి సత్య కుమార్, బిజెపి నాయకులకు జేసీ పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ''ఆవేశంలో నోరు జారాను... సినీనటి మాధవి లత గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. నేను ఏదో తప్పు చేశానని ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళందరి గురించి నాకు తెలుసు. నాపై విమర్శలు చేసిన వాళ్లంతా ఫ్లెక్సీ వాళ్ళే... అంతకుముందు వాళ్ళ పేర్లు కూడా ఎవరికీ తెలియదు. కొంతమంది రాజకీయాల్లోకి వచ్చి ఏదో అదృష్టం కలిసి వచ్చి నాయకులు అయ్యారు'' అని జేసీ అన్నారు.
''నన్ను విమర్శించే వాళ్ళు పవర్ ఉన్నప్పుడు మాట్లాడటం కాదు... పవర్ లో లేనప్పుడు మాట్లాడాలి. సత్యసాయి వాటర్ వర్క్స్ లో సమస్యలపై నేను ధర్నా చేస్తా. నా మీద మాట్లాడే వాళ్ళందరూ ప్రజలకు మేలు చేస్తే... ప్రజలే గుర్తిస్తారు. నన్ను నమ్మి న్యూ ఇయర్ వేడుకలకు తాడిపత్రిలోని 16 వేల మంది మహిళలు, చిన్నారులు హాజరయ్యారు. నేను న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేస్తే విమర్శించిన వాళ్లు... చేతనైతే రాబోయే సంక్రాంతి పండుగ నిర్వహించాలి. నేను మరీ అంత నీచుడిని కాదు.. నా గురించి ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను పార్టీ మారాల్సిన అవసరం లేదు'' అని పేర్కొన్నారు.
''తాడిపత్రి ప్రజలకు నాపై ప్రేమ ఉంది కాబట్టే కట్టలు కట్టలు డబ్బులు చందాలుగా ఇస్తున్నారు. చంద్రబాబు విజన్ ను చూసే తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాను. అమరావతి నిర్మాణం కోసం పాటుపడుతున్న చంద్రబాబుతో... తాడిపత్రి అభివృద్ధి కోసం నేను పోటీ పడతాను. నన్ను విమర్శించే వాళ్ళు గన్మెన్లను పెట్టుకుని తిరుగుతున్నారు. నాకు, నా కుమారుడికి గన్మెన్లు అవసరం లేదు... గన్మెన్లను పెట్టుకొని షో చేయాల్సిన అవసరం లేదు'' అని జేసీ తెలిపారు.