అనంత‌పురం జిల్లాలో ఉద్రిక్త‌త.. జేసీ సోద‌రుల గృహ‌నిర్భందం

JC Brothers house arrest in Ananthapuram.అనంతపురం జిల్లా తాడిపత్రిలో మ‌రోసారి ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.జేసీ సోద‌రుల గృహ‌నిర్భందం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2021 6:24 AM GMT
JC Brothers

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మ‌రోసారి ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తాడిప‌త్రిలో గ‌త‌నెల 24న వైకాపా, తేదేపా నాయ‌కుల మ‌ధ్య జ‌రిగిన రాళ్ల‌దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న కుమారుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోదు చేశారు. తనపై నమోదు చేసిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎత్తివేసేంత వరకు.. తాడిప‌త్రి ఎమ్మార్వో కార్యాల‌యం వ‌ద్ద మౌన‌దీక్ష చేప‌డ‌తామ‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో.. పోలీసులు జేసీ సోద‌రుల‌ను గృహ‌నిర్భందం చేశారు. దివాక‌ర్‌రెడ్డిని జూటూరులోని ఆయ‌న తోట‌లో, ప్ర‌భాక‌ర్ రెడ్డిని తాడిప‌త్రిలోని ఆయ‌న ఇంట్లో నిర్భంధం చేశారు.

తహశీల్దార్ కార్యాలయం ఎదుట జేసీ సోదరుల ఆమరణ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. ఉదయం జేసీ బ్రదర్స్ , ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ఇంటిదగ్గర పోలీసులు కవాతు నిర్వహించారు. సభలు, సమావేశాలు, ధర్నాలకు అనుమతి లేదని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ముందు జాగ్ర‌త్తల్లో భాగంగా జేసీ సోద‌రుల‌ను గృహ నిర్భందం చేసిన‌ట్లు పేర్కొన్నారు.

జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిని గృహ‌నిర్భందం చేయ‌డంతో ఆయ‌న స‌తిమ‌ణీ ఉమారెడ్డి అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం ఇచ్చారు. అనంత‌రం ఆమె తహశీల్దార్ కార్యాలయం వెళ్లి విన‌తిప‌త్రం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు.


Next Story
Share it