జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం.. తెగిన ఏసీ బోగీల లింక్

రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ నుంచి ఏసీ బోగీల లింక్ తెగిపోయింది.

By Srikanth Gundamalla  Published on  22 May 2024 5:29 AM GMT
janmabhoomi train, two ac coaches, visakhapatnam,

 జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం.. తెగిన ఏసీ బోగీల లింక్ 

ఇటీవల కాలంలో భారతీయ రైల్వేలో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సాంకేతిక లోపం కారణంగా తలెత్తితే.. మరికొన్ని సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగాయి. తాజాగా రైల్వే శాఖలో మరోసారి సాంకేతిక లోపం సంఘటన వెలుగు చూసింది. ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ నుంచి ఏసీ బోగీల లింక్ తెగిపోయింది. ఈ సంఘటన విశాఖపట్నం నుంచి లింగంపల్లికి బయల్దేరిన జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది.

జన్మభూమి సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 6.15 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరింది. అయితే.. ఈ ట్రైన్‌లో కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఇక వెంటనే గమనించిన సిబ్బంది వెంటనే స్పందించారు. అప్రమత్తతో రైలును ఆపేశారు. ఆ తర్వాత వెంటనే స్టేషన్‌కు రైలును తీసుకొచ్చి మరమ్మతు పనులు ప్రారంభించారు. ఏసీ బోగీ లింక్‌ తెగిపోవడంతో జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచిపోయింది. ఇక లింక్‌ తెగిపోయిన సమయంలో రైలు నెమ్మదిగానే వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ప్రమాదం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ రైలు వేగంగా ఉన్న క్రమంలో ఈ లింక్ తెగిపోయి ఉంటే పరిణామాలు మరోలా ఉండేవని అంటున్నారు.

సాంకేతిక సమస్య కారణంగానే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి రెండు ఏసీ బోగీలు తెగిపోయాయని రైల్వే అధికారులు చెప్పారు. సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నామని తెలిపారు. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పంపిస్తామని చెప్పారు. మొత్తంగా బుధవారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యంగా నడుస్తుందని చెప్పారు. కాగా.. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 6.15 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా రాత్రి 7.40 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది.ఇటు జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లి నుంచి ప్రతి రోజూ ఉదయం 6.15కి బయల్దేరుతుంది.. విశాఖపట్నంకు రాత్రి 7.40కు చేరుకుంటుంది.


Next Story