జగన్ తల్లిని, చెల్లిని గెంటేశాడు..పెద్ద నటుడు: నాగబాబు

ఏపీ సీఎం జగన్‌పై జనసేన పార్టీ నేత నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla
Published on : 10 Feb 2024 9:00 PM IST

janasena, nagababu,  ycp govt, cm jagan,

 జగన్ తల్లిని, చెల్లిని గెంటేశాడు..పెద్ద నటుడు: నాగబాబు 

ఏపీ సీఎం జగన్‌పై జనసేన పార్టీ నేత నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ అద్భుతమైన నటుడు అని చెప్పారు. అనకాపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ... భూప్రపంచంలోనే ఆయనలా ఎవరూ నటించలేరని అన్నారు. ముఖం అమాయకంగా పెట్టి చేసిన నటనకు ఆస్కార్‌ ఇచ్చినా తక్కువే అన్నారు నాగబాబు. అధికారం అందక ముందు పార్టీ లోగోలో వైఎస్సార్‌ ఫొటోను పెట్టిన జగన్‌.. అధికారం వచ్చాక ఫొటోను మెల్లిగా తొలగించారని విమర్శించారు. అంతేకాదు.. ఆస్తుల కోసం సొంత తల్లి, చెల్లిని కూడా కాదనుకున్నారనీ.. గెంటేశారంటూ మండిపడ్డారు. సీఎం జగన్‌ పెద్ద స్వార్ధపరుడంటూ ఆరోపించారు. వైసీపీ అనుకూల సర్వేలు మాత్రమే నిజమైనవనీ.. మిగిలినవన్నీ ఫేక్‌ సర్వేలంటూ వైసీపీ నేతలు మాట్లాడటం వారి అమాయకత్వానికి నిదర్శనం అని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమి గెలుపు ఖాయమని నాగబాబు వ్యాఖ్యానించారు.

జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడంటూ పైర్ అయ్యారు నాగబాబు. అంబేద్కర్ ముందే రాజ్యాంగం రాయబట్టి, కేంద్రంలో బలమైన బీజేపీ ప్రభుత్వం ఉండటంతో రాష్ట్రంలో ఈ మాత్రమైనా బతుకుతున్నామని అన్నారు. లేదంటై వైసీపీ చేసే అరాచకాలకు ఎప్పుడై బలి అయ్యేవాళ్లమన్నారు. అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జగన్‌ జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. రీకాల్‌ అనే హక్కు లేదు కాబట్టి వైసీపీని ఐదేళ్లు ప్రజలు భరించారనీ లేదంటే తొలి ఏడాదే అధికారం కోల్పోయేవారని నాగబాబు అన్నారు.

తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరించి రైతులను, కార్మికులను ఆదుకుంటామని పాదయాత్ర సమయంలో జగన్ చెప్పారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని మూసివేసి, కార్మికులను రోడ్డు పాలుజేశారని అన్నారు. ఫ్యాక్టరీ భూములను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. అనకాపల్లి బెల్లానికి 120 ఏళ్ల ఘన చరిత్ర ఉందన్న నాగబాబు.. ఆసియాలోనే బెల్లం ఎగుమతులకు అనకాపల్లి ఫేమస్‌ అని చెప్పారు.

Next Story