పదవులపై నాకు ఇంట్రెస్ట్ లేదు: నాగబాబు
నెల్లూరులో రెండో రోజు జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. రాజకీయ పదవులపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని నాగబాబు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 6:45 PM ISTపదవులపై నాకు ఇంట్రెస్ట్ లేదు: నాగబాబు
నెల్లూరులో రెండో రోజు జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం.. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పదవులపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని నాగబాబు అన్నారు.
టీడీపీ-జనసేన పొత్తు రానున్న ఎన్నికల్లో తమను అధికారానికి చేరువ చేస్తుందని నాగబాబు దీమా వ్యక్తం చేశారు. తన ఓటుపై స్పందించిన ఆయన..సొంత రాష్ట్రంలో ఏపీలో ఓటు వేసేందకు తెలంగాణలో తమ కుటుంబం ఓట్లను రద్దు చేసుకుందని తెలిపారు. మంగళగిరిలో ఓటు హక్కు కోసం రదఖాస్తు చేసుకుంటే.. ఓటు హక్కు రాకుండా బూత్ లెవల్ స్థాయిలో కూడా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని అన్నారు.
అలాగే తాను ఎంపీగా పోటీ చేస్తున్నా అని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అదంతా రూమర్ మాత్రమే అని కొట్టిపారేశారు నాగబాబు. కాకాణి అక్రమాలకు వ్యతిరేకంగా సోమిరెడ్డి దీక్ష చేపట్టారని అన్నారు. అయితే.. సమయం లేకపోవడం వల్లే అక్కడికి వెళ్లలేకపోయినట్లు చెప్పారు. జనసేన-టీడీపీల మధ్య పలు అంశాల్లో విబేధాలు ఉండొచ్చు అనీ.. వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని నాగబాబు తెలిపారు. నెల్లూరులో జనసేన నుంచి అభ్యర్థి పోటీ చేస్తారని తెలిపారు. వైసీపీ వైనాట్ 175 అంటోందని.. కానీ తాము వైనాట్ వైసీపీ జీరో అని అంటున్నట్లు నాగబాబు చెప్పారు. వైసీపీలో నియంతలా జగన్ పాలన ఉందని విమర్శించారు. ప్రజలు జగన్‌ను ఇంటికి పరిమితం చేయడం పక్కా అన్నారు నాగబాబు.