సీఎం జగన్‌ ఫొటోతో జనసేన ప్రెస్‌మీట్‌.. సర్కార్‌కు సవాల్

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం ఇంట్రెస్టింగ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

By Srikanth Gundamalla
Published on : 29 Jan 2024 5:45 PM IST

janasena, nadendla manohar, press meet,  cm jagan photo,

సీఎం జగన్‌ ఫొటోతో జనసేన ప్రెస్‌మీట్‌.. సర్కార్‌కు సవాల్ 

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం ఇంట్రెస్టింగ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. మీడియా సమావేశానికి ముందు జనసేన పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఖాళీగా ఉన్న కుర్చీల ఫొటోను పెట్టి.. అందులో ఒకదాన్ని హైలెట్ చేశారు. ఇవాళ నాదెండ్లతో పాటు సమావేశంలో ఒకరు పాల్గొంటున్నారు.. వారెవరో చెప్పుకోండి చూద్దామంటూ పోస్టు పెట్టారు.

అయితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొంటున్నారేమో అని అంతా అనుకున్నారు. కానీ.. ఎవరూ ఊహించని విధంగా ప్రెస్‌మీట్‌ ప్రారంభం అయిన తర్వాత కాసేపటికే ఆ స్పెషల్‌ కుర్చీలో సీఎం జగన్‌ ఫొటోను తీసుకొచ్చి పెట్టారు. ఆ ఫొటోను నాదెండ్ల మనోమర్‌ ఆయన పక్కనే పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. ఏనాడూ మీడియా ముఖం చూడని ముఖ్యమంత్రిని తామే మీడియా ముదుకు తీసుకొచ్చామని చెప్పారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్ మాట్లాడిన ఒక వీడియోను జనసేన పార్టీ ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది.

నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ప్రభుత్వ కాలం పూర్తవుతున్న సందర్భంగా సీఎం జగన్ ఎక్కడా ప్రెస్‌మీట్‌లు పెట్టడం లేదని.. జనసేన తరఫున సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పుడు లెక్కలను వివరించడానికి విజయవాడ నగరంలో ప్రెస్‌పెడతామనీ.. మీరు వచ్చేందుకు సిద్దమా అని సవాల్‌ విసిరారు. వైసీపీ సర్కార్‌ ఐదేళ్లలో లెక్కలు తారుమారు చేసి.. మోసాలు చేసిందని అన్నారు. ప్రజలంతా ఈ సంగతి గమనించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. వైసీపీ పాలనలో జరిగిన అన్ని అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజల కోసం చర్చించుకుందామని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి దాడులు చేయాలని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రోత్సహించడం దారుణమని అన్నారు. తానెప్పుడు ఇలాంటి పరిస్థితులను చూడలేదన్నారు నాదెండ్ల మనోహర్.

Next Story