కరోనా కష్టకాలంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల్ని ప్రభుత్వం గురువారం విడుదల చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఎకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. రెండో విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను విడుదల చేయనున్నారు.
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల్ని నాలుగు విడులల్లో చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మొదటి దశ కింద ఏప్రిల్ 19న రూ.671 కోట్లను జమ చేశారు. మూడో దశ విద్యాదీవెన ఈ డిసెంబర్‌లో, నాలుగో విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం అమలు చేయనుంది.