ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే లక్ష్యం
Jagananna Vidya Deevena funds Released.ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే తమ
By తోట వంశీ కుమార్ Published on 29 July 2021 12:53 PM ISTప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన రెండో సాయం నిధులను గురువారం విడుదల చేశారు. 10.97 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.693.81 కోట్లను విడుదల చేశారు. ఇవి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ అవుతాయి. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా విద్యార్థులు చదవే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సుల ఫీజుల్ని నాలుగు విడతల్లో చెల్లించనున్నారు.
విద్యా దీవెన కానుక రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనన్నారు. ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేది తన తాపత్రయమని చెప్పారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన అనే మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. 'తల్లిదండ్రులకు భారం లేకుండా విద్యాదీవెన అమలు చేస్తున్నాం. దేవుడి ఆశీస్సులతోనే ఇదంతా చేయగల్గుతున్నాం. ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు కోసం 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దగ్గర 33శాతం నిరక్షరాస్యత ఉంది. బ్రిక్స్ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇంటర్ తర్వాత డ్రాప్ అవుట్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని మార్చడం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టాం. తల్లిదండ్రులకు భారం లేకుండా వసతి దీవెన అందిస్తున్నాం. ప్రతి మూడు నెలలకోసారి తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. తల్లులే నేరుగా ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. విద్యా దీవెనతో ఇప్పటివరకు రూ.5,573 కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యాకానుక, మనబడి నాడు-నేడు కింద..మొత్తం రూ.26,677 కోట్లు ఖర్చు చేశాం' అని సీఎం జగన్ అన్నారు.