జగనన్న తోడు పథకం.. నేడు ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు జమ
Jagananna thodu scheme Rs10000 is deposited in each account today.కరోనా సంక్షోభంలోనూ జగన్ సర్కార్ ప్రజలకు సంక్షేమ
By తోట వంశీ కుమార్ Published on 8 Jun 2021 8:57 AM IST
కరోనా సంక్షోభంలోనూ జగన్ సర్కార్ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా సీఎం హమీలను నెరవేర్చుకుంటూ వస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, కూరగాయలు, పండ్లు అమ్ముకొని బతికేవారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్మేవారు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీ, ఇత్తడి పనిచేసేవారు ఇలా చిన్న చిన్న వ్యాపారులందర్నీ ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది తెచ్చిన పథకమే.. 'జనగన్న తోడు పథకం'.
గతేడాది నవంబర్ 25న ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలను అందించిన సంగతి తెలిసిందే. తాజాగా 'జగనన్న తోడు పథకం' కింద రెండో విడత డబ్బులను సీఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. దాదాపు 3.7లక్షల మంది చిరు వ్యాపారులు, వృత్తి కళాకారులు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణాన్ని అకౌంట్లలో వేయనున్నారు. ఇందుకోసం రూ.370కోట్లు ఖర్చు చేయనుండగా, ఆ మొత్తంపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. సీఎం తన క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
రెండు దశలకు రూ.905 కోట్లు కేటాయించగా, రూ.49.77 కోట్ల వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇందుకు సంబంధించి లబ్దిదారుల మొబైళ్లకు డబ్బులు జమ అయినట్లుగా మెసేజ్‌లు వస్తాయి. ఆ తర్వాత వారు బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. ఈ రుణాలు సరిపోకపోతే చిరు వ్యాపారులు వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్), స్త్రీనిధి సహకార సమాఖ్య ద్వారా కూడా రుణాలు పొందవచ్చు.