టీకా ఉత్సవ్.. రోజుకు 6లక్షల మందికి టీకా : సీఎం జగన్
Jagan review on corona vaccine. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
By తోట వంశీ కుమార్ Published on 9 April 2021 6:05 PM ISTదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని నిర్దేశించారు. ఆ నాలుగు రోజులు కనీసంగా 24లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి కోవిడ్–19 వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు.
అవసరం అయిన వ్యాక్సిన్ డోసులు కేంద్రాన్ని కోరాలన్నారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వ్యాక్సిన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు. టీకా ఉత్సవ్ విజయవంతం చేశాక మరిన్ని డోసులు తెప్పించుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కొవిడ్ వ్యాక్సిన్‌పై సమీక్షించిన సీఎం జగన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,892 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,765 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదు కాగా.. ఆతరువాత గుంటూరు జిల్లాలో 490, కర్నూలు జిల్లాలో 341, విశాఖ జిల్లాలో 335, నెల్లూరు జిల్లాలో 292 పాజిటివ్ కేసులు గుర్తించారు.దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,18,597 కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈమహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృత్యువాత పడిన వారి సంఖ్య 7,279కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,245 కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,94,896కి చేరింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,53,65,745 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్‌లో వెల్లడించారు.