ఆంధ్రాలో కోళ్ల పందేలు.. పోలీసులకు అడ్డుకోవడం సాధ్యమేనా?

సంక్రాంతి వచ్చిందంటే గోదావరి ప్రాంతంలోని అనేక గ్రామాలు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని అనేక గ్రామాలు కోడిపందాలకు కేంద్రంగా నిలుస్తాయి.

By అంజి  Published on  13 Jan 2025 1:22 PM IST
AP police, cockfights, Andhra, Sankranti

ఆంధ్రాలో కోళ్ల పందేలు.. పోలీసులకు అడ్డుకోవడం సాధ్యమేనా? 

సంక్రాంతి వచ్చిందంటే గోదావరి ప్రాంతంలోని అనేక గ్రామాలు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని అనేక గ్రామాలు కోడిపందాలకు కేంద్రంగా నిలుస్తాయి. భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, రాజమహేంద్రవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కోట్లాది రూపాయల పందేలు జరుగుతాయి. ఈ కోడిపందాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. పందేలకు అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నా, పందెం రాయుళ్లు మాత్రం వెనకడుగు వేయడం లేదు.

కోడిపందాలు అంటే ఏమిటి?

కోడి పందేలలో రెండు కోళ్లను బరిలో ఉంచుతారు. వాటి కాళ్లకు చిన్న కత్తి కూడా కడుతారు. వాటిలో ఏదైతే ముందు పడిపోతుందో.. లేదా ఏదైతే బరి నుండి పారిపోతుందో అది ఓడిపోయినట్లు. ఈ పోరాటం చాలా హింసాత్మకంగా ఉంటుంది. కోడిపందాలు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో సంక్రాంతి సమయంలో భారీగా జనాదరణ పొందినప్పటికీ, చట్టవిరుద్ధమైన చర్య ఇది.

తీవ్రమైన పోటీ:

ప్రతి సంవత్సరం ఈ కోళ్ల పందేల ఈవెంట్‌ల కోసం పలు జాతుల కోళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. పెరువియన్ డబుల్-క్రాస్డ్ రూస్టర్ కు మంచి డిమాండ్ ఉంది. బలం, చురుకుదనం విషయంలో పేరు తెచ్చుకున్న స్థానిక అసీల్ కోడిపుంజు కూడా బాగా పోరాడగలదు.

కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పెంపకందారులు బెట్టింగ్‌ ప్రియులను దోచుకోవడమే లక్ష్యంగా ఈ కోళ్లకు జాగ్రత్తగా శిక్షణ ఇచ్చి వాటిని పెంచుతూ ఉంటారు. అధికారులు పదేపదే హెచ్చరించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాలలో వేలకొద్దీ అక్రమ కోడిపందాల మైదానాలు పుడుతూ ఉంటాయి. కొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా కోడిపందాలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మారాయి. ఈ కార్యక్రమాలను నిర్వహించడం, ప్రచారం చేయడంలో పలువురు రాజకీయ నేతల బంధువులు కూడా పాల్గొంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

భీమవరంలో ఎన్నో ఏళ్లుగా కోడిపందాలు చూస్తున్నా.. వాళ్లు టెంట్లు వేసి కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా భోగి పండుగ రోజు నుంచి పందాలు మరింత జోరందుకుంటున్నాయని భీమవరం వాసి శివ చెప్పారు.

పందెం కోళ్లకు భారీ గిరాకీ:

గోదావరి ప్రాంతానికి చెందిన ఒక కోళ్ల పెంపకందారుడు పెరువియన్ కోళ్లలో నైపుణ్యం, పోరాటాల సమయంలో అసాధారణంగా చురుకుగా ఉంటాయని తెలిపారు. ఈ ఘోరమైన పోటీలకు వాటిని ప్రముఖ ఎంపికగా మారుతూ ఉంటాయి. రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, తెలంగాణ నుండి కూడా ఔత్సాహికులు సంక్రాంతి పందేల కోసం ఒక్కో కోడికి 2 నుండి 3 లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు సమాచారం.

ఈ మూడు రోజులలో బెట్టింగ్ కార్యకలాపాలు దాదాపు 1,000 కోట్ల వరకు ఉంటాయి. రాజకీయ నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, యువకులతో సహా వేలాది మంది ఈ పోటీలలో పాల్గొంటారు.

కలెక్టర్లు హై అలర్ట్:

గోదావరి, ఇతర జిల్లాల్లో కోడిపందాలు నిర్వహించే వారిపైనా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి జిల్లా కలెక్టర్లు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కోడి పందేల నిషేధాన్ని తెలియజేస్తూ పశుసంవర్ధక శాఖ ద్వారా అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

డ్రోన్లను ఉపయోగిస్తున్న పోలీసులు:

సంక్రాంతి సమయంలో కోడిపందాలు నిర్వహించకుండా నిర్వాహకులను నియంత్రించేందుకు రాష్ట్ర పోలీసులు డ్రోన్లు, కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీలు), ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) ర్యాంక్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పోలీసుల వద్ద దాదాపు 130 డ్రోన్లు ఉన్నాయి. అన్ని సమస్యాత్మక ప్రదేశాలలో బృందాలు కాలానుగుణంగా డ్రోన్ ఆధారిత పెట్రోలింగ్ నిర్వహిస్తాయి.

చట్టపరమైన చిక్కులు:

జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 ప్రకారం కోడిపందాలు నిషేధించారు. చట్టంలోని సెక్షన్ 11(1)(m)(ii) జంతువులతో పోరాడడాన్ని నేరంగా పరిగణిస్తారు.

సంప్రదాయం వర్సెస్ చట్టం:

కోడిపందాలు సంక్రాంతితో ముడిపడి ఉన్న సాంస్కృతిక సంప్రదాయమని మద్దతుదారులు వాదిస్తున్నారు. అయితే ఇది క్రూరమైన, చట్టవిరుద్ధమైన చర్యగా చెబుతున్నారు. దీన్ని అరికట్టడంలో అధికారులు కూడా గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటారు.

సంక్రాంతి సంబరాల తరుణంలో, అధికారులు చట్టాన్ని అమలు చేసి కోడి పందేలకు స్వస్తి చెప్పగలరా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

Next Story