ఇంట‌ర్ విద్యార్థులు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు.. త‌ప్పు దొర్లింది.. 2 మార్కులు క‌లుపుతున్నాం

ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం ఫిజిక్స్ ప‌రీక్ష‌లో ఓ త‌ప్పు దొర్ల‌డంతో 2 మార్కులు క‌లుపుతున్న‌ట్లు బోర్డు తెలిపింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2023 4:06 AM GMT
AP Inter Board, AP News

ప‌రీక్ష రాస్తున్న విద్యార్థులు ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాస్తున్న విద్యార్థుల‌కు ఇంట‌ర్ విద్యామండ‌లి శుభ‌వార్త చెప్పింది. సోమ‌వారం ద్వితీయ సంవ‌త్స‌రం ఫిజిక్స్‌(భౌతిక‌శాస్త్రం) ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. అయితే.. ఇంగ్లీష్ మీడియం ప్ర‌శ్నాప‌త్రంలో ఓ త‌ప్పు దొర్లిన‌ట్లు బోర్డు గుర్తించింది. దీంతో ఈ ప‌రీక్ష రాసిన విద్యార్థులు అంద‌రికి 2 మార్కులు క‌ల‌ప‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఫిజిక్స్ పేపర్ 2లోని తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో మూడో ప్రశ్నగా 'అయస్కాంత అవపాతం'ను నిర్వచించుము ? అని వ‌చ్చింది. అదే ఇంగ్లీష్ మీడియం ప్రశ్నాపత్రంలో 'డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లే నేషన్' అని తప్పుగా ప్రచురితమైంది దానికి బదులుగా 'డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇన్ క్లీనేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డీప్' రావాల్సి ఉంది. దీనిని గుర్తించిన బోర్డు.. ఈ ప్రశ్నను విద్యార్థులు రాసినా, రాయ‌క‌పోయినా 2 మార్కులు కలుపుతామని తెలిపింది. విద్యార్థులు ఎవ్వ‌రూ ఆందోళ‌న చెంద‌వద్ద‌ని కోరింది.

పరీక్షలకు సంబంధించిన సమస్యలపై ఏపీ ఇంటర్‌ విద్యామండలి టోల్‌ఫ్రీ నంబరు 18004257635 ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏమైనా సందేహాలు ఉంటే ఈ నంబర్ లో సంప్రదించవచ్చు. ఇక రాష్ట్రంలో 1,489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10,03,990మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటి సంవ‌త్స‌రం విద్యార్థులు 4,84,197 ఉండగా రెండ‌వ‌ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు.

Next Story