రూల్స్ ఒప్పుకోవ‌న్న సిబ్బంది.. బైక్ పై కుమారుడి మృత‌దేహాం త‌ర‌లింపు

Inhuman incident in Nellore District.తిరుప‌తి రుయా ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే పొట్టి శ్రీ‌రాములు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2022 11:13 AM IST
రూల్స్ ఒప్పుకోవ‌న్న సిబ్బంది.. బైక్ పై కుమారుడి మృత‌దేహాం త‌ర‌లింపు

తిరుప‌తి రుయా ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అలాంటి ఘ‌ట‌న‌నే చోటు చేసుకుంది. కుమారుడి మృత‌దేహాన్ని ఇంటికి త‌ర‌లించేందుకు అంబులెన్స్ ఇవ్వాల‌ని కోర‌గా.. 108 వాహ‌నం ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోవంటూ సిబ్బంది చెప్ప‌డంతో గ‌త్యంత‌రం లేని స్థితిలో బైక్‌పైనే ఓ తండ్రి త‌న కుమారుడి మృత‌దేహాన్ని తీసుకువెళ్లాడు.

బుధ‌వారం సంగంలో శ్రీరామ్‌, ఈశ్వ‌ర్ అనే ఇద్ద‌రు చిన్నారులు బ‌హిర్భూమికి వెళ్లి క‌నిగిరి జ‌లాయశం ప్ర‌ధాన కాలువ‌లో ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌డిపోయారు. స్థానికులు కాలువ‌లోకి దిగి వారిని రక్షించేందుకు య‌త్నించ‌గా అప్పటికే చిన్నారులు మృతి చెందారు. ఈశ్వ‌ర్ మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్ల‌గా.. శ్రీరామ్‌ను నీటిలోంచి బ‌య‌ట‌కు తీయ‌గానే స్థానికులు, బంధువులు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువ‌చ్చారు. అప్ప‌టికే ఆ బాలుడు మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు.

శ్రీరామ్ మృత‌దేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు 108 వాహ‌నం ఏర్పాటు చేయాల‌ని శ్రీరామ్ బంధువులు ఆస్ప‌త్రి సిబ్బందిని కోరారు. ఇందుకు రూల్స్ ఒప్పుకోవంటూ అనుమ‌తి నిరాక‌రించారు. మ‌హాప్ర‌స్థానం వాహ‌నం అందుబాటులో లేదు. ఇత‌ర వాహ‌నాల వారిని బ‌త్రిమిలాడినా ముందుకు రాలేదు. గ‌త్యంత‌రం లేక బైక్‌పైనే శ్రీరామ్ మృత‌దేహాన్ని తీసుకువెళ్లారు.

వైసీపీ ప్ర‌భుత్వ తీరులో మార్పు రావ‌డం లేదు : లోకేష్‌

'రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూశాం. విశాఖ కేజీహెచ్‌ ప్రసూతి విభాగంలో ఒక కుటుంబం పై తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూసి షాక్ అయ్యాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం రూ.15 వేలు డిమాండ్ చేశారు సిబ్బంది. రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా వైసిపి ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదు. నెల్లూరు జిల్లా సంఘంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బిడ్డని కోల్పోయిన బాధలో ఉన్న తండ్రి అంబులెన్స్ ఏర్పాటు చెయ్యాలని వేడుకున్నా ఆస్పత్రి సిబ్బంది మానవత్వంతో స్పందించకపోవడం దారుణం. ఎవరూ సహాయం చెయ్యని దయనీయ పరిస్థితిలో బైక్ పైనే కొడుకు శ్రీరామ్ మృత దేహాన్ని తరలించాడు ఆ తండ్రి. పబ్లిసిటీ పిచ్చితో మీరు జెండా ఊపిన వాహనాలు అన్నీ ఎక్కడికి పోయాయి జగన్ రెడ్డి గారు? సిబ్బంది, కనీస సౌకర్యాల లేమితో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ నిర్వహణ మీ ఏ2 సాయిరెడ్డి అల్లుడికి కట్టబెట్టాకే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఈ అమానవీయ ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా?' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Next Story