విజయవాడలో మహిళ వీరంగం.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. కాలితో తన్ని..!
In Vijayawada Woman attack on RTC BUS Driver.స్కూటీపై రాంగ్ రూట్‌లో వచ్చింది ఓ మహిళ. అది గమనించిన
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2022 7:56 AM ISTస్కూటీపై రాంగ్ రూట్‌లో వచ్చింది ఓ మహిళ. అది గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అయితే.. బస్సు తన వాహనంపైకి దూసుకొచ్చిందన్న ఆగ్రహంతో ఊగిపోయిన ఓ మహిళ వీరంగం సృష్టించింది. తాను చేసిన తప్పును పట్టించుకోకుండా సరైన మార్గంలో వచ్చిన డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రైవర్‌ను కొడుతూ కాలితో తన్నింది. అడ్డుకోబోయిన ప్రయాణికులపైనా దుర్భాషలాడింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
ప్రత్యక్షసాక్షులు, పోలిసులు తెలిపిన వివరాల మేరకు.. వాంబే కాలనీకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ విద్యాధరపురంలో డిపోలో విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ప్రకాశం రోడ్డులో వెలుతున్నాడు. మధ్యాహ్నాం 3.30 గంటల సమయంలో ఆంధ్రా ఆస్పత్రి ఎదురుగా ఓ మహిళ ద్విచక్రవాహనం పై వెలుతూ బస్సుకు అడ్డువచ్చింది. గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయగా.. బస్సు మహిళ సమీపంలోకి వెళ్లి ఆగింది. ఈ ఘటనతో ఆగ్రహానికి లోనైన సదరు మహిళ.. తిడుతూ బస్సులోకి వచ్చింది.
డ్రైవర్‌ను కొట్టి, చొక్కా చింపి, కాలితో తన్నింది. తప్పు ఎవరిదో చూస్తున్న ప్రయాణీకులు మహిళను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. వారిపైనా దుర్భాషలాడింది. నడి రోడ్డుపై ఈ ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడకు చేరుకున్న పోలీసులు డ్రైవర్, మహిళను ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యారావు పేట పోలీసులు మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. దాడికి పాల్పడింది కృష్ణలంక తారాకరామానగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనను పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌గా మారాయి. కాగా.. డ్యూటీలో ఉన్న డ్రైవర్‌పై దాడి చేయడాన్ని ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు తీవ్రంగా ఖండించారు.