నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన ఆయుర్వేద మందును పరిశీలించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బృందం సోమవారం రానుంది. ఈ మందులో శాస్త్రీయత నిర్ధారించి, మరింత విస్తృతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ ఆ మందును పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఐసీఎంఆర్‌ను కోరారు. దీంతో నేడు ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం రానుంది.
ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయుష్ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు మందు నమూనాలు సేకరించారు. ఈ మందు వల్ల ఎటువంటి నష్టం ఉండదని ప్రాథమికంగా నిర్ణయించారు. దీన్ని పసరు మందుగానే గుర్తిస్తామని, ఆయుర్వేద మందు అనలేమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఐసీఎంఆర్ ఎలాంటి నివేదిక ఇస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.