ఈగల్ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు

ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్ మెంట్ (ఈఏజీఎల్ఈ:ఈగల్ ) ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

By Kalasani Durgapraveen  Published on  28 Nov 2024 9:30 PM IST
ఈగల్ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు

ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్ మెంట్ (ఈఏజీఎల్ఈ:ఈగల్ ) ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో ఈగల్ హెడ్ క్వార్టర్స్, ప్రత్యేక నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న ప్ర‌భుత్వం.. జిల్లాకు ఒక నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయ‌నుంది. ప్రజల ఆరోగ్యం, రక్షణ, సామాజిక బాధ్యతలో 'ఈగల్' కీలకంగా వ్యవహరించనుంది. డ్రగ్ సంబంధిత నేరాల నివారణ, విచారణ, పరిశోధనపై 'ఈగల్' ప్రత్యేక దృష్టి సారించనుంది.

నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఉండ‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల‌లో వెల్ల‌డించింది. డిప్యూటేషన్ లో అధికారులను నియమించుకోవాలని హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. శిక్షణను సమర్థవంతంగా పూర్తి చేసి ఈగల్ ఆమోదించాకే డిప్యూటేషన్ లో పని చేసే ఛాన్స్ క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొంది.

ఈగల్ హెడ్ ఆఫీస్, నార్కోటిక్ పోలీస్ స్టేషన్, జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సెల్ లో పని చేసే వారికి విధి నిర్వహణ కాలంలో 30శాతం స్పెషల్ అలోవెన్స్ ప్ర‌క‌టించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో 5 స్పెషల్ కోర్టులు లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును డీజీపీ పర్యవేక్షించనున్నారు.

ఒక్క అమరావతి హెడ్ ఆఫీస్ లోనే 249మందితో పకడ్బంధీ నిఘా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఒక్కో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ లో 66 మంది సిబ్బంది డిప్యుటేషన్ లో విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. జిల్లాలవారీగా నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ లో 144 మంది విధులు నిర్వహిస్తారు. మొత్తం 358 మంది అధికారులతో ఈగల్ వ్యవస్థ ఏర్పాటు కానున్న‌ట్లు తెలిపింది.

ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా కలుపుకుని డ్రగ్స్ నియంత్రణ కోసం మొత్తం 459 మందితో వ్య‌వ‌స్థ ఏర్పాట‌వుతుంద‌ని వెల్ల‌డించింది. ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఏపీ వ్యాప్తంగా 26 డిస్ట్రిక్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ (డీఎన్ సీసీ)ల ఏర్పాటుకు హోంశాఖ క‌స‌ర‌త్తు ప్రారంభించింది.

Next Story