చంద్రబాబు కోసం జైలు, చట్టాలను రూపొందించలేదు: హోంమంత్రి
రాజమండ్రి జైల్‌లో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించామని చెప్పారు హోంమంత్రి తానేటి వనిత.
By Srikanth Gundamalla Published on 12 Sep 2023 10:02 AM GMTచంద్రబాబు కోసం జైలు, చట్టాలను రూపొందించలేదు: హోంమంత్రి
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కాం కేసులో చంద్రబాబుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబుకి జైల్‌లో భద్రత సరిగా లేదని ఆయన తరఫు లాయర్లు, టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసం చట్టాలు, జైలును రూపొందించలేదని.. జైల్లో అనేకర రకాల నేరాలు చేసిన వ్యక్తులు ఉంటారని చెప్పారు. అయితే.. రాజమండ్రి జైల్‌లో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించామని చెప్పారు హోంమంత్రి తానేటి వనిత.
చంద్రబాబుకి భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. జైల్లో మావోయిస్టులు ఉన్నా కూడా చంద్రబాబుకి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఎందుకంటే మావోయిస్టుల బ్లాక్ చంద్రబాబు ఉన్న బ్లాక్‌కు దూరంగా ఉంటుందని వనిత తెలిపారు. అయితే.. చంద్రబాబు భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచామని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని సాక్ష్యాలు లేకుండా ఎవరూ అరెస్ట్ చేయరు అని.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో పూర్తి ఆధారాలతోనే సీఐడీ అధికారులు చంద్రబాబుని అరెస్ట్ చేశారని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తానేతి వనిత చెప్పారు. వారి అభ్యర్థన మేరకు భోజనం ఇంటి నుంచి అందిస్తున్నట్లు చెప్పారు. అయితే.. ఈ కేసులో చంద్రబాబు సీఐడీ అధికారులకు సహకరించాలని కోరారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంలో కక్ష సాధింపు చర్య లేదని.. నాడు చంద్రబాబే కక్షతో కాంగ్రెస్‌తో కలిసి జగన్‌ను జైల్‌కు పంపారని అన్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు ఖండించిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై కూడా తానేటి వనిత స్పందించారు. మమతా బెనర్జీకి ఆంధ్రప్రదేశ్‌పై ఎంత మేరకు అవగాహన ఉందో తనకు తెలియదని అన్నారు. ఇక చంద్రబాబు గురించి ఆలోచించకుండా లోకేశ్, పవన్ కళ్యాణ్ వారివారి పనులు చేసుకోవాలని సూచించారు. లోకేశ్ పదేపదే తనని అరెస్ట్ చేయాలని చెప్పనక్కర్లేదని.. నేరం రుజువు అయితే ఎంతటి వారికైనా జైలు గతేపడుతుందని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు.