సీఎం సభకు పాఠశాల బస్సులు.. విద్యాసంస్థలకు సెలవు..!
Holiday for educational institutions in Bapatla Today.ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో తగ్గేదేలే
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2022 12:07 PM ISTఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు ఏపీ సీఎం జగన్. ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం సాయం పంపిణీ చేసేందుకు సీఎం జగన్ నేడు బాపట్ల పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా ఆవిర్భావం తరువాత తొలిసారి జిల్లాకు ముఖ్యమంత్రి వస్తుండడంతో అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు కేటాయించారు. ఈ నేపథ్యంలో అధికారుల ఆదేశాలతో విద్యాసంస్థలకు గురువారం సెలవు ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఏప్రిల్ – జూన్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లను సీఎం జగన్ గురువారం బాపట్లలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద జగన్ ప్రభుత్వం మొత్తం రూ.11,715 కోట్ల సాయం అందించింది.
జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివించవచ్చు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జగన్ ప్రభుత్వం జమ చేస్తుంది.