ఏపీలో పదో తరగతి మార్కుల విధానం ఖరారు..!
High power committee has finalized marks system.కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో
By తోట వంశీ కుమార్ Published on 15 July 2021 12:15 PM ISTకరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల పరీక్ష ఫలితాల విధానాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు ఎలా ప్రకటించాలా అన్న విధానంపై హైపవర్ కమిటీ చాలా కసరత్తు చేసింది. బుధవారం కమిటీ తుది సమావేశం నిర్వహించి పదో తరగతి ఫలితాలపై తుది నిర్ణయం తీసుకుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఎస్సెస్సీ బోర్డు ఫలితాల విడుదలపై తుది కసరత్తు చేపట్టనుంది.
పరీక్షల్లో విద్యార్థులకు వారి ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఫార్మేటివ్–1, ఫార్మేటివ్–2 మార్కులను తీసుకుని గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎఫ్‌ఏ(ఫార్మేటివ్ అసెస్‌మెంట్) పరీక్షలకు సంబంధించి లిఖిత పూర్వక పరీక్షలు, ఇతర పరీక్షలను విభజిస్తారు. ఎఫ్‌ఏ–1లోని లిఖిత పరీక్షకు సంబంధించిన 20 మార్కులను 70 శాతానికి పెంపుచేస్తారు. ఇతర 3 రకాల పరీక్షలకు సంబంధించిన 30 మార్కులను 30 శాతంగా పరిగణిస్తారు. ఉదాహరణకు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒక విద్యార్థికి ఎఫ్‌ఏ–1 లిఖిత పూర్వక పరీక్షలో 20 మార్కులకు 18 మార్కులు వస్తే వాటిని 70 శాతానికి పెంపుచేసి 31.5 మార్కులుగా పరిగణిస్తారు. మిగతా మూడు విభాగాల్లో 30 మార్కులకు 27 మార్కులు సాధించి ఉంటే వాటిని 30 శాతానికి కుదింపుచేసి 13.5 మార్కులు వచ్చినట్టుగా పరిగణిస్తారు. మొత్తంగా ఎఫ్‌ఏ–1లో ఆ విద్యార్థికి 45 మార్కులు వచ్చినట్టుగా ప్రకటిస్తారు. అదే విధంగా ఎఫ్‌ఏ–2 మార్కులనూ విభజిస్తారు. ఎఫ్‌ఏ–2లో ఆ విద్యార్థికి 47 మార్కులొస్తే కనుక ఆ రెంటినీ కలిపి 100 మార్కులకు 92 మార్కులు సాధించినట్టుగా.. గ్రేడును నిర్ణయిస్తారు.