శ్రీకాకుళం జిల్లాలో హృదయ విదారక ఘటన.. తల్లి మృతదేహాన్ని బైక్ పై
Heart-breaking incident in Srikakulam district. శ్రీకాకుళం జిల్లాలో తల్లి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై 20 కిలో మీటర్ల దూరంలోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లాడు.
By తోట వంశీ కుమార్ Published on 27 April 2021 1:15 PM ISTకరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా రోగులతో ఆస్పత్రులన్ని దాదాపుగా నిండిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కేసుల పెరుగుదల ఆగడం లేదు. కొన్ని చోట్ల లాక్‌డౌన్లు, కొన్ని చోట్ల కంటైన్‌మెంట్ జోన్లు, మరికొన్ని చోట్ల కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన వారు ఆస్పత్రులకు వెళ్లేందుకు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
గతంలో ఏదైనా రోగంతో కుటుంబ సభ్యులు కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారు కానీ చనిపోతే వందల సంఖ్యలో జనం వచ్చేవారు. హితులు, స్నేహితులు, సన్నిహితులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించే వారు. కానీ. ఇప్పుడు లాక్‌డౌన్ నిబంధనల పేరుతో మృతులను సందర్శించేందుకు కూడా ఎవరూ రావడం లేదు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు సైతం మృతుల చివరి చూపుకు సైతం నోచుకోవడం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.
మందస మండలానికి చెందిన చెంచుల అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె కుమారుడు మరో వ్యక్తి సాయంతో బైక్‌పై పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. స్కానింగ్ కోసం కాశిబుగ్గ గాంధీనగర్‌లోని శ్రీకృష్ణ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ అనంతరం సదరు మహిళ మృతి చెందింది. దీంతో ఆ మహిళ మృతదేహాన్ని స్వగానికి తీసుకువెళ్లెందుకు యత్నించగా.. ప్రైవేట్ వాహనాలు కానీ అంబులెన్స్ గానీ ముందుకు రాలేదు. కరోనాతో ఆమె మృతి చెందిందన్న అనుమానంతో వారు నిరాకరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన తల్లి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై 20 కిలో మీటర్ల దూరంలోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో బైక్ పై ముగ్గురు వెలుతుండడంతో పోలీసులు ఆపి.. వివరాలు అడుగగా ఈ విషయం తెలిసింది.
కాగా.. ఇటువంటి ఘటననే తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటీవల చోటు చేసుకుంది.కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేసే నాగలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె కరోనా సోకి మృతి చెందిందేమోనని స్థానికులు భావించారు. ఇంకేముంది ఆమె మృతదేహం వద్దకు వచ్చేందుకు జనం భయపడ్డారు. ఆటోలో ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటిక వద్దకు తరలించాలని మృతురాలి భర్త భావించాడు. అయితే.. అందుకు ఆటోడ్రైవర్ కూడా ఒప్పుకోలేదు. చివరకు అతడికి రైల్వే పోలీసులు, స్థానికులు 2వేల 500 విరాళాలు సేకరించి ఇచ్చారు. ఇతర ఏ సాయం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో భార్య మృతదేహాన్ని తన భుజాలపై వేసుకుని మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లాడు. కరోనా వేళ ఇలాంటి హృదయ విదాకర ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి.