దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రధాని మోదీ ఈ రోజు ఉద‌యం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. అయితే.. విజ‌య‌వాడ‌లో వ్యాక్సినేష‌న్ సంద‌ర్భంగా కొంత టెన్ష‌న్ నెల‌కొంది. విజయవాడ జీజీహెచ్‌ లో వ్యాక్సిన్ వేయించుకున్న రాధ అనే హెల్త్ వర్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ వేసిన వెంటనే కళ్లు తిరిగి అస్వస్థతకు గురికాగా.. స్పందించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సాధారణంగా ఉంది.

వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికి కళ్లు తిరిగినట్టు, చలిగా అనిపించిందని రాధా తెలిపారు. ప్రస్తుతం కొద్దిగా చలిగా ఉన్నా.. ఇబ్బందేమీలేదని సూచించారు. అయితే.. ఆమె ఉద‌యం నుండి ఎలాంటి ఆహ‌రం తీసుకోక‌పోవ‌టంతో పాటు వ్యాక్సిన్ ప‌ట్ల కాస్త భ‌యంగా ఉండ‌టంతోనే ఇబ్బందిప‌డిందని వైద్యులు తెలిపారు. కాగా.. వ్యాక్సినేషన్‌ అయిన తర్వాత వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తిని అబ్జర్వేషన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. 30 నిమిషాల తర్వాత వారి పరిస్థితి చూసి.. తర్వాతే పంపిస్తున్నారు. ఒక‌వేళ‌ అనుకోని అవాంతరాలు ఎదురైతే.. వెంటనే వైద్య సహాయం అందించడానికి వైద్య నిపుణులను అందుబాటులో ఉంచుతున్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story