అమరావరతి: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలియజేసింది. హాల్ టికెట్లను http://slprb.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు పీఆర్‌బీ చైర్మన్ మీనా ఒక ప్రకటనలో సూచించారు. జూన్ 1 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించిన 38,910 మంది అభ్యర్థులు పాల్గొననున్నారు.
వేగంగానే ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెల్లడించింది. మొత్తం 6,100 పోలీసు కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పరీక్షను జేఎన్‌టీయూ ద్వారా నిర్వహిస్తున్నట్లు బోర్డు పేర్కొంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో 9441450639 లేదా 9100203323 నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు.