గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్ ను ఢీకొట్టనున్న మురుగుడు లావణ్య

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే విషయమై కూడా ఏపీ ఓటర్లు ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 March 2024 9:00 AM GMT
ground report, tdp, nara lokesh vs ycp newbie lavanya, mangalagiri,

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్ ను ఢీకొట్టనున్న మురుగుడు లావణ్య

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే విషయమై కూడా ఏపీ ఓటర్లు ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. 2019 ఓటమి తర్వాత కంబ్యాక్ ఇవ్వాలని.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి నియోజకవర్గంపై పట్టు నిలబెట్టుకోడానికి చాలానే కష్టపడుతూ ఉన్నాడు నారా లోకేష్. టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. నారా లోకేష్ ఓటమి పాలైనప్పటికీ అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడైన నారా లోకేష్ ఈ నియోజకవర్గంలో ఎలాగైనా టీడీపీ జెండాను ఎగురవేయాలని ఆశిస్తూ ఉన్నారు.

మంగళగిరిలో ఫలితాలను నిర్ణయించగల పద్మశాలిలు:

గత ఎన్నికల్లో నారా లోకేశ్‌పై 5,337 ఓట్లతో విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మళ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడం లేదు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో తొలుత గంజి చిరంజీవిని వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎంచుకుంది. ఈ నియోజకవర్గంలో పద్మశాలి (నేత సామాజికవర్గం)కి మంచి పట్టు ఉంది. చిరంజీవి ఆగస్టు 2022లో టీడీపీని వీడారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైఎస్సార్‌సీపీని మధ్యలో వీడడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్‌ను ఎదుర్కోవడానికి చిరంజీవిని డిసెంబర్ 11, 2203న వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇక్కడ బీసీలను ఆకర్షించడానికి వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది.

YSRCP చేసిన ఈ ఎన్నికలలో వెనుకబడిన తరగతుల (BC) కమ్యూనిటీ నుండి మొత్తం 80,000 ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఫిబ్రవరి 20న ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే పార్టీ అధిష్టానం మనసు మార్చుకుని పద్మశాలి నుంచి మురుగుడు లావణ్యను ఎంపిక చేసి లోకేష్‌ కు ప్రత్యర్థిగా నిలిపింది. లావణ్య మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికలలో, హనుమంత రావు కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. కమల కూడా 2009 లో మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వారి జనాభా పరిమాణాన్ని బట్టి, పద్మశాలిలకు మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలను నిర్ణయించే శక్తి ఉంది.

మంగళగిరి నియోజకవర్గం:

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలు ఉన్నాయి. సుమారు 2.68 లక్షల మంది ఓటర్లు (2019 నాటికి) ఉన్నారు. గుంటూరు జిల్లాలో మంగళగిరి విజయవాడ శివారులో ముఖ్యమైనది. తెనాలి రెవెన్యూ డివిజన్‌లో భాగమైన ఈ పట్టణం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా భాగం. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం ఉంది. ఈ పట్టణానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. బట్టలు నేసే వారు ఎక్కువగా ఉన్నారు. మంగళగిరి ఫ్యాబ్రిక్స్, చీరలు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సూచికలలో ఒకటిగా ఉన్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మొత్తం పోలైన ఓట్లలో 45.47 శాతం ఓట్లతో విజయం సాధించారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారా లోకేష్‌ కు 42.14 శాతం ఓట్లు, సీపీఐకి చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు (4 శాతం ఓట్లు) సాధించారు. 1952 నుండి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆరుసార్లు ఎన్నికల్లో విజయం సాధించింది. వామపక్షాలు నాలుగుసార్లు, టీడీపీ రెండుసార్లు (1983, 1985లో తిరిగి), YSRCP రెండుసార్లు (2014, 2019లో) గెలిచింది. జనతా పార్టీ ఒకసారి గెలిచింది.

నారా లోకేష్‌కు మద్దతు ఇచ్చే ఆలోచనలో నేతన్నలు:

‘‘నారా లోకేష్ స్థానికేతరుడైనప్పటికీ ఈసారి టీడీపీకి ఓట్లు వేసే అవకాశం ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి నియోజకవర్గంలో గత రెండు దఫాలుగా అవకాశం ఇచ్చినా కష్టకాలంలో మా పరిస్థితిని పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడం తప్ప మంగళగిరికి ప్రత్యేకంగా ఏమీ చేయలేదు” అని మంగళగిరికి చెందిన చేనేత కార్మికుడు సంగబత్తుల వెంకటేశ్వరరావు న్యూస్ మీటర్‌తో అన్నారు.

టీడీపీకి, అధికార వైఎస్సార్‌సీపీకి మధ్య పోలిక గురించి మాట్లాడుతూ.. నిరుద్యోగం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేనేత కార్మికులకు టీడీపీ రూ.2వేలు అందించిందని.. 40 ఏళ్లుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్న 57 ఏళ్ల వ్యక్తి తెలిపారు. వారిని ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఏటా రూ.18వేలు వైఎస్‌ఆర్‌ చేయూత కింద, రూ.24వేలు వైఎస్‌ఆర్‌ నేత నేస్తం అమలు చేయడం ప్రారంభించిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నా సరుకులు, విద్యుత్ ధరలు పెరగడం పట్ల మెజారిటీ నేత కార్మికులు సంతృప్తి చెందడం లేదని వెంకటేశ్వరరావు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ మురుగుడు లావణ్యకు మద్దతు ఇవ్వడం గురించి ప్రశ్నించగా.. "ఈసారి కుల రాజకీయాలను ప్రోత్సహించకూడదని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాం." అని ఆయన అన్నారు.

కౌలు రైతులను ఆళ్ల రామకృష్ణారెడ్డి పట్టించుకోలేదు:

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మొగ్గు చూపుతామని మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడుకు చెందిన బీ శ్రీనివాస్‌రావు అన్నారు. వైఎస్సార్‌సీపీ ఓటమికి గల కారణాలను వివరిస్తూ.. విజయవాడలో ఇసుక కొరత వల్ల కార్మికవర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని.. ఉపాధి అవకాశాలు లేవని వివరించారు. నేను మా గ్రామంలో కౌలు రైతుగా పని చేస్తున్నాను, తనను తాను రైతుగా చెప్పుకునే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కౌలు రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదని, మంగళగిరి వాసులు మార్పును ఆశిస్తున్నారని అన్నారు. ఎందుకంటే 1985 ఎన్నికల తర్వాత మంగళగిరిలో టీడీపీ ఎప్పుడూ గెలవలేదన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలా కాకుండా నారా లోకేష్ ప్రజలకు చేరువయ్యారు. ప్రతిపక్షంలో ఉంటూ నారా లోకేష్ తన జేబులోంచి డబ్బు ఖర్చు చేసి ప్రజలకు సంక్షేమాన్ని అందించారని, ముఖ్యంగా మహిళలకు సాధికారత కల్పించారని తెలిపారు.

లావణ్యకు కాస్ట్ ఫ్యాక్టర్ ఓటింగ్ ప్రయోజనం ఉంది

మంగళగిరిలో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారని నియోజకవర్గ రైతు కూరాల నాగేశ్వరరావు అంటున్నారు. నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తనయుడు, లావణ్య బిసి సామాజిక వర్గానికి చెందిన మహిళా. ప్రస్తుతం బీసీ సామాజికవర్గం, ఆధిపత్య కులాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీసీ సామాజికవర్గానికి చెందిన 50 వేల మంది ఓటర్లు, రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నందున, కులాల ఓటింగ్ విషయంలో లావణ్యకు ప్రయోజనం ఉందని, నేత సంఘం నారా లోకేష్‌కు మద్దతు ఇస్తే అది లావణ్య గెలుపుకు కష్టమని ఆయన అన్నారు.

ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి వైఫల్యంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా, తాను వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి రామకృష్ణారెడ్డికి మద్దతు ఇవ్వలేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తానని నాగేశ్వరరావు అన్నారు. “నేను ఏటా రైతు భరోసా పొందుతున్నాను, నా పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు అందుతున్నాయి, నా భార్య వైఎస్ఆర్ చేయూత ద్వారా రూ. 18,750 ఆర్థిక సహాయాన్ని అందుకుంటుంది. అన్ని ప్రయోజనాలు పొందిన తర్వాత నేను వైఎస్సార్‌సీపీకి తప్ప వేరే పార్టీకి ఎందుకు ఓటు వేస్తాను?" అని రావు ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో మంగళగిరి శరవేగంగా అభివృద్ధి చెందింది:

రాష్ట్రంలోనే అద్భుతమైన అభివృద్ధి సాధించిన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటని తాడేపల్లి వాసి వి.సాంబశివరావు అన్నారు. ఆ క్రెడిట్‌ వైఎస్‌ జగన్‌, రామకృష్ణారెడ్డిలకు దక్కుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మురుగుడు లావణ్యను నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించడం అభినందనీయమైన చర్య అని, ఇది సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా ప్రశంసించదగ్గ చర్య అని అన్నారు.

గత పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను నాడు-నేడు కార్యక్రమం కింద పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రికి సాంబ శివరావు కృతజ్ఞతలు తెలిపారు. “ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమం వల్ల రాష్ట్రంలో విద్యార్థుల డ్రాపౌట్ రేటు క్రమంగా తగ్గుముఖం పట్టింది,” అని ఆయన అన్నారు. లావణ్య గెలుపు అవకాశాల గురించి, నారా లోకేష్‌తో పోలిస్తే ఆమెకు అనుభవం లేకపోయినా, ప్రజలకు పరిచయం లేకపోయినా.. YSRCP ప్రభుత్వం నుండి లాభం పొందిన వారు నిస్సందేహంగా ఆమెకు మద్దతు ఇస్తారన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, చిరంజీవిలు వైఎస్ జగన్ కోసం తమ అజెండాలను పక్కనపెట్టి లావణ్య గెలుపుకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story