ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వివాదం సద్దుమణగకముందే, ఏపీ ప్రభుత్వం విజయనగరంలో ఆసుపత్రి పేరును మార్చింది. మహారాజా ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చింది. రాత్రికి రాత్రే నేమ్ బోర్డు మార్చేశారు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. అభివృద్ధి చేయలేక జగన్ ప్రభుత్వం ఇలా అర్ధంతరంగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. పాత పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ పేరు మార్చడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
పేర్లు మార్చడం, రంగులు మార్చడం తప్ప పాలన చేయడం చేతకావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసిన మహారాజుల వంశాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. ఆస్పత్రికి కోట్లాది రూపాయల భూమిని విరాళంగా ఇచ్చిన మహారాజు పాత పేరునే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రి పేరును మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు తండ్రి పీవీజీ రాజుపై వైఎస్సార్‌సీపీకి గౌరవం ఉందని ఎమ్మెల్యే కె.వీరభద్ర స్వామి అన్నారు.
అయితే వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో పేరు మార్చడం తప్పనిసరి అని ఆయన వివరించారు. జిల్లా ఆసుపత్రి స్థాయి నుంచి మెడికల్ కళాశాల, టీచింగ్ స్టాఫ్ గా అప్ గ్రేడ్ కావడంతో పేరు మారుస్తూ ఆదేశాలు వచ్చాయని ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ డా.పద్మలీల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చిన సంగతిని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.