అందరిది ఒక బాధ అయితే.. మందుబాబులది మరో బాధ. ప్రజలంతా కరోనా బారిన పడకుండా ఉండేందుకు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, రాత్రి కర్ఫ్యూలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. లాక్‌డౌన్‌లు విధించడంతో మందుబాబులు మద్యం దొరకక అల్లాడిపోతున్నారు. ఉన్న కొద్ది సమయంలో మద్యం తెచ్చుకునేందుకు వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు అసలు లాక్‌డౌన్ లు ఎందుకు విధించారో తెలీదు అన్నట్లు.
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసులు విజృంభిస్తుండడంతో.. మధ్యాహ్నాం 12 నుంచి పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల కొనుగోలుతో పాటు పనులు చక్కబెట్టుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మద్యం దుకాణాలకు సైతం ఉదయం ఆరు గంటల నుంచి 12 వరకే తెరచుకోవాలని చెప్పింది. దీంతో మద్యం కొనుగోలు చేసేందుకు మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.
రాష్ట్రంలోని ఓ మద్యం దుకాణం వద్ద భౌతిక దూరం లేకుండా.. కనీసం మాస్కులు కూడా సరిగ్గా ధరించకుండా మద్యం కొనుగోలు కోసం మందుబాబులు నిలబడి ఉన్న ఫోటోను టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో పోస్టు చేసి జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ' రేషన్ కి ఇదే పరిస్థితి.. ఇప్పుడు వ్యాక్సిన్ కి ఇదే పరిస్థితి.. అది చాలదు అన్నట్లు వైన్ షాప్ ల ముందు దుస్థితి.. నేను ఉన్నాను.. నేను విన్నాను.. కానీ ఏవి కనపడవు అంతేనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారూ' అంటూ ట్వీట్ చేశారు బుచ్చయ్య చౌదరి.