రేషన్ డోర్ డెలివ‌రీ వాహనదారులకు శుభ‌వార్త చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం

Good news to Ration Door Delivery Drivers.రేష‌న్ డోర్ డెలివ‌రీ వాహ‌న‌దారుల‌కు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2021 4:23 AM GMT
రేషన్ డోర్ డెలివ‌రీ వాహనదారులకు శుభ‌వార్త చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం

రేష‌న్ డోర్ డెలివ‌రీ వాహ‌న‌దారుల‌కు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ప్ర‌తి నెలా ఇచ్చే చెల్లింపుల్ని పెంచుతూ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ఒక్కొ వాహ‌న‌దారుడికి అద్దె కింద రూ.10వేలు, పెట్రోల్ నిమిత్తం రూ.3వేలు, హెల్ప‌ర్ చార్జీల కోసం రూ.3వేలు క‌లిపి నెల‌కు రూ.16వేలు చెల్లిస్తున్నారు. అయితే.. వారు క్షేత్ర‌స్థాయిలో ప‌డుతున్న ఇబ్బందుల‌ను గుర్తించిన ప్ర‌భుత‌్వం అద్దెను రూ.10వేల నుంచి రూ.13వేల‌కు, వాహ‌న‌దారుడి స‌హాయ‌కుడికి చెల్లించే హెల్ప‌ర్ చార్జీల‌ను రూ.3వేల నుంచి రూ.5వేల‌కు పెంచాల‌ని నిర్ణ‌యించింది. పెట్రోల్ చెల్లింపుల్లో ఎలాంటి మార్పుల చేయ‌లేదు. దీంతో ఒక్కొ వాహ‌న‌దారుడికి రూ.21వేలు అంద‌నున్నాయి. గ‌తంలో పోలిస్తే రూ.5వేల అద‌నంగా అంద‌నుంది.

ఇక రేష‌న్ డోర్ డెలివ‌రీ వాహనాన్ని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచాల‌ని ఆదేశించింది. త‌హ‌సీల్దార్లు ఎప్ప‌టిక‌ప్పుడు ఈ వాహ‌నాల‌ను త‌నిఖీ చేసి ఉన్న‌తాధికారుల‌కు నివేదిక ఇస్తారు. ఒక‌వేళ వాహ‌నం ప‌రిశుభ్రంగా లేక‌పోతే.. అద‌నంగా చెల్లిస్తున్న మొత్తంలో కోత విధించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పౌర స‌ర‌ఫ‌రా శాఖ అధికారులు తెలిపారు. రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం మొత్తం 9,260 మొబైల్‌ వాహనాలను సమకూర్చింది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2,300, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 700, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 3,800, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 660, ఈబీ (ఎకనామికల్లీ బ్యాక్‌వార్డ్‌) కార్పొరేషన్‌ ద్వారా 1,800 మందికి వాహనాలను అందజేశారు.
Next Story
Share it