ఏపీలో రైతులకు శుభ‌వార్త‌.. ఒకే రోజు 3 పథకాల ద్వారా నగదు జమ

Good news to AP farmers.క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తూ పేద‌ల‌కు అండ‌గా ఉంటోంది జ‌గ‌న్ స‌ర్కార్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2021 4:40 AM GMT
ఏపీలో రైతులకు శుభ‌వార్త‌.. ఒకే రోజు 3 పథకాల ద్వారా నగదు జమ

క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తూ పేద‌ల‌కు అండ‌గా ఉంటోంది జ‌గ‌న్ స‌ర్కార్‌. తాజాగా రైతుల‌కు తీపి క‌బురు చెప్పింది. లక్షల మంది రైతులకు లబ్ది చేకూరేలా మొత్తం మూడు పథకాలకు(వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం) సంబంధించిన రూ.2190 కోట్ల న‌గ‌దును ఈ రోజు(మంగ‌ళ‌వారం) రైతుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌చేయ‌నుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆపీసులో ముఖ్యమంత్రి జగన్.. కంప్యూటర్ బటన్ నొక్కి ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. ఆగస్ట్ నెల‌లో రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.977 కోట్లు జ‌మ చేయ‌గా.. ఆ మొత్తం పోను మిగిలిన మొత్తం రూ. 1,214 కోట్లు జ‌మ కానుంది.

సాగుకు స‌న్న‌ద్ద‌మవుతున్న అన్న‌దాత‌కు వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద రెండో విడుత పెట్టుబ‌డి సాయంగా 50.37 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లు జ‌మ‌చేయ‌నున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద ఏటా రూ. 13,500 సాయం అందిస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 2,052 కోట్లతో కలిపి రెండున్నర సంవత్సరాలలో ఇప్పటివరకు రైతన్నలకు జ‌గ‌న్‌ ప్రభుత్వం అందించిన మొత్తం రైతు భరోసా సాయం రూ. 18,777 కోట్లు. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం క్రింద 1,868 రైతు గ్రూపులకు రూ. 27.17 కోట్ల లబ్ది చేకూరనుంది. ఆధునిక యంత్రాల‌ను రైతుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చే ల‌క్ష్యంతో వైఎస్ఆర్ ఆర్బీకేల‌కు అనుబంధంగా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను (సీహెచ్‌సీలను) ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువైన యంత్ర పరికరాలతో 10,750, క్లస్టర్‌ స్థాయిలో రూ.25 లక్షల విలువైన వరికోత యంత్రాలతో కూడిన 1,035 యంత్ర సేవాకేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్నారు.

ఏ ఒక్క రైతు న‌ష్ట‌పోకూడ‌దు అన్న ఉద్దేశ్యంతో అర్హుల ఎంపిక అత్యంత పార‌ద‌ర్శ‌క‌తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అర్హుల జాబితాల‌ను సామాజిక త‌నిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్ర‌ద‌ర్శిస్తూ రైతుల నుంచి అభ్యంత‌రాల‌ను స్వీక‌రిస్తోంది. అర్హులై ఉండి లబ్ధిపొందని వారి వివరాలను గ్రీవెన్స్‌ పోర్టల్‌లో పొందుపరిచి వారిలో అర్హులను గుర్తిస్తోంది.

Next Story